కబ్జా కోరల్లో ఉన్న అటవి భూములు స్వాధీనం చేసుకోవాలి.!

-గూడులేని గిరిజనులకు పంచాలి.
-రేణుక అక్షర మహిళా మండలి డిమాండ్

WhatsApp Image 2026-01-03 at 5.24.16 PM

మణుగూరు : 

అటవీ భూములను కబ్జా చేసి వాటికి పట్టాలు సృష్టించి వక్రమార్గంలో అమ్ముకుంటున్నారని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ ఆరోపించింది. శనివారం అంబేద్కర్ సెంటర్ లోని రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మణుగూరు మండలంలోని గనిబోయిన గుంపులోని 30 ఎకరాల ఫారెస్ట్ భూమికి పట్టా సృష్టించిన రియల్ మాఫియా వాటిని విక్రయించి లక్షలు తమ ఖాతలో వేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అటవీ భూమికి దొంగ పట్టా సృష్టించిన వారితో పాటు అందుకు సహకరించిన అటవి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి సదరు భూమిని స్వాధీనం చేసుకోకపోతే సంబంధిత అధికారులను ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని ఆమె హెచ్చరించారు. దర్జాగా ఏండ్ల నాటి చెట్లను నరికి ఫోర్ లైన్ రోడ్లు వేసిన పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు సాధారణ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆమె తెలిపారు. ఇసుక ర్యాంప్ కు దారి ఇచ్చేందుకు అనుమతులున్నాయని చెప్పి గుట్టమల్లారం వద్ద రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోని చెట్లను ఎర్లుతో సహా తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా జిల్లా కలెక్టర్ పేరు చెప్పి గుట్ట మల్లారం వద్ద ఇసుక క్వారీల కోసం మామూళ్ల మత్తులో వేల సంఖ్యలో వృక్షాలు నరికి రోడ్లు వేశారని దుయ్యబట్టారు. కంచె చేనును మేసిన చందంగా అడవిని రక్షించాల్సిన అధికారులే దగ్గరుండి భక్షించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలు కమలాపురం, రాయిగూడెం ఏరియాల్లో సొంత భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని ఖాళీ చేయించి అమాయకులపై కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు వల్లించే అటవీ అధికారులు కొన్ని వేల చెట్లు తొలిగించి వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా చేస్తే కళ్ళున్న కబోధిలా వ్యవహరించారని ఆమె విమర్శించారు. బేస్ క్యాంప్ లు ఏర్పాటు చేసి అదే దారి గుండా వెళ్ళిన ఇసుక లారీల వద్ద రూ. 100 నుండి 200 వసూలు చేసిన అటవీ అధికారులు ఎవరి అనుమతితో వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అనుమతులు లేవంటూ... జలపాతాలకు దారి అంటూ మాట మార్చి ప్రజలను పక్కదారి పట్టించి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. నరికిన చెట్లకు, జలపాతాలకు దారి నిర్మించిన అధికారులకు అనుమతులు ఎక్కడ ఉన్నాయో బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర అటవీ అధికారులను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కలిసి విషయాన్ని వివరించి అడ్డగోలుగా అడవి నరికిన అటవి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. గనిబోయిన గుంపు లోని 30 ఎకరాల ఫారెస్ట్ పట్టా భూమిని గిరిజన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. వాటి వెనుక ఎందరు బడా.. బడా.. బాబులున్న ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతామన్నారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో మాతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, కుల, మహిళ సంఘాలతో ఎఫ్ డీ ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సీనియర్ నాయకురాలు ఎండి షబానా, కోరి శ్యామల, ఉపాధ్యక్షురాలు బొడ్డు సౌజన్య, రెడ్డిబోయిన రేణుక, దేరంగుల సుజాత, కన్నాపురం వసంత, డాకూరి సౌజన్య  తదితరులు పాల్గొన్నారు.

About The Author