నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రిని కలిసిన తెలంగాణ జర్నలిస్టు సంఘాల జేఏసీ 

WhatsApp Image 2025-12-30 at 7.52.51 PM

కరీంనగర్ : 

తెలంగాణలో గతంలో ఇచ్చిన మీడియా అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగానే ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని రాష్ట్ర సమాచార,పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అక్రిడిటేషన్ల జీవో 252 విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైనా పొరపాట్లు ఉంటే త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశమై సవరిస్తామని అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(టీజేఏ జేఏసీ) నాయకులు మంత్రి పొంగులేటిని కలిసి జీవో 252 సవరణతో పాటు జర్నలిస్టుల ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని,అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మరో జీవో తెస్తామని అన్నారు. డెస్క్ లో పనిచేసే వారికి, ఫీల్డ్ లో పనిచేసే జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలను అంచెలంచెలుగా అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సమాచార పౌరసంబధాల శాఖ స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లకు  పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలని, చిన్న పత్రికలు, కేబుల్ ఛానెళ్లతో పాటు ఎంపానల్మెంట్ కాకుండా ఉన్న ఇతర పత్రికలకు సంబంధించిన ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు.రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులకు కూడా జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధమని, ఈ నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని, ఇందుకు కోసం వెంటనే ఆయా విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యం కల్పించాలని, 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలని,అదేవిధంగా జర్నలిస్టుల వాహనాలకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు సదుపాయం కల్పించాలని వారు మంత్రిని కోరారు. మంత్రిని, కమీషనర్ ను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్లు మామిడి సోమయ్య(టీడబ్ల్యూజేఎఫ్), కే. కోటేశ్వర్ రావు(ఏడబ్ల్యూజేఏ), అనంచిన్ని వెంకటేశ్వరరావు(టీజే ఎస్ఎస్), పులిపలుపుల ఆనందం(ఐఎఫ్ డబ్ల్యూజే), రావికంటి శ్రీనివాస్(డబ్ల్యూజేఐ), గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజు తదితరులున్నారు.

About The Author