మహాద్భుతంగా సాగుతున్న మత్తు రాజకీయాలు..
( స్పెషల్ కరస్పాండెంట్,హైదరాబాద్ )
- పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు…
- తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం మాఫియా
- చట్టాలకూ, కోర్టులకూ అతీతంగా సాగుతున్న మద్యం వ్యాపారం..
- మద్యం ప్రియులను నిలువునా ముంచుతున్న దుర్మార్గం..
- ప్రభుత్వానికి ఆదాయం అంటూ సామాన్యులకు శఠగోపం..
- సంక్షేమపథకాలు అమలుచేయాలంటే మద్యమే మార్గమా..?
- దొడ్డిదారిన రాజకీయ నాయకుల జేబులకు చేరుతున్న ప్రజాధనం మాటేమిటి..?
- మద్యం ఏరులా పాడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతకాలి..?
- ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే అదికూడా మీ కార్పొరేట్లకు ఆదాయమే..
- ఎటు చూసినా ఓటేసిన అమాయకుడే సర్వనాశనం అవుతున్నాడు..
- మద్యం మహమ్మారిపై యుద్ధం చేసేందుకు సిద్ధం అయ్యింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

ఒక విచిత్రమైన పరిష్టితి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొని ఉంది.. మత్తు పదార్ధాలు సేవించడం, ఆస్వాదించడం ఆరోగ్యానికి హానికరం అన్నవిషయం అందరికీ తెలుసు.. కానీ మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ముద్రించి మద్యం వ్యాపారం చేయవచ్చు.. ఇది చట్టవిరుద్ధం కాదు.. అలాగే ధూమపానం అనారోగ్యం క్యాన్సర్ కారకం అని చూపించి సిగరెట్ల వ్యాపారం చేయవచ్చు ఇది కూడా న్యాయమే.. అలాగే భగవద్గీత మీద ప్రమాణం చేసి న్యాయస్థానాల్లో అబద్దపు సాక్షాలు చెప్పవచ్చు.. ఇదే న్యాయం..? ఇవేం చట్టాలు..? పైగా కోట్లరూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు మందు తాగవద్దు, పొగతాగవద్దు అని.. అసలు అలాంటి వాటిని నిషేధిస్తే సరిపోతుంది కదా..? అది మాత్రం చేయరు.. వాటిమీద వచ్చే ఆదాయం కావాలి.. దాంతో ప్రభుత్వాలు నడపాలి.. అసలు ఇదేమి దౌర్భాగ్యం..? అడ్డగోలుగా కమిషన్లు, లంచాలు తీసుకోవడం అధికారులు, రాజకీయనాయకులు మానేస్తే ఇలాంటి దౌర్భాగ్యపు ఆదాయం అవసరం ఉండదు కదా..? మత్తుకు బానిసలై ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే బాగుచేసుకోవడానికి లక్షలు ఖర్చుపెడతారు.. అదొక ఆదాయం.. ఎందుకంటే కార్పొరేట్ వైద్య సంస్థలన్నీ రాజకీయ నాయకులకు చెందినవే.. ఇది జగమెరిగిన సత్యం.. అందుకే ప్రభుత్వ విద్య రంగాన్ని అటకెక్కించారు.. అసలు వీళ్లకు ప్రజల బాగోగులు అవసరం లేదు.. వారువేసే ఓట్లు కావాలి.. తద్వారా అధికారం కావాలి.. ఆపై అక్రమార్జన కావాలి.. వీరికి భయం లేదు.. ఎందుకంటే చచ్చేవాళ్లు చస్తున్నా.. పుట్టేవాళ్ళు పుడుతూనే వుంటారు.. పెరుగుతూనే ఉంటారు.. ఓటర్లుగా మారుతూనే ఉంటారు.. ఇది భారతదేశం.. ఖర్మ భూమి.. మేరా భారత్ మహాన్..
కోర్టు తీర్పులు గాలిలో కలిసిన వ్యవస్థలో ఉన్నాం మనం :
కానీ వాస్తవం ఏమిటి? కోర్టు ఆదేశాలకూ లెక్క లేకుండా మద్యం దుకాణాలు పాఠశాలల పక్కన, ఆలయాల గుమ్మం వద్ద, బస్తీల మధ్యలో నడుస్తున్నాయి. రాత్రి 12 గంటలు దాటినా షట్టర్లు మూయడం లేదు. లైసెన్సు లేకుండా “ఫ్రెండ్‌షిప్ బార్లు”, “రెస్టారెంట్ లిక్కర్ పాయింట్లు” పేర్లతో మద్యం స్వేచ్ఛగా విక్రయమవుతోంది. దీనికి తోడు పర్మిట్ రూముల మాట సరే సరి..
దోపిడీ కేంద్రంగా మారిపోయిన ఎక్సైజ్ శాఖ, వీరితో అంతగాగుతున్న అధికారులు, పోలీసులు :
ఎక్సైజ్ శాఖ అసలు ఉద్దేశం చట్టం అమలు చేయడం, మద్యం విక్రయాన్ని నియంత్రించడం. కానీ తెలంగాణలో ఇది పూర్తిగా కమీషన్ కేంద్రంగా మారిపోయింది. షాపులు లైసెన్సు పొందడంలో కోట్ల రూపాయల లంచాలు, ఇక రెన్యూవల్ కోసం నెల నెలా ఇతరత్రా హామీలు, పోలీసులకు సరికొత్తగా “సైలెన్స్ ఫీ” అని కొత్తగా.. దారుణం ఏమిటంటే ఇవన్నీ ఇప్పుడు మామూలు పద్ధతులు అయ్యాయి.
ఒక చిన్న షాపు లైసెన్సు కూడా ఇప్పుడు 2–3 కోట్లు లంచం లేకుండా దొరకదు. లైసెన్సు ఇచ్చే ముందు జరిగే ‘టెండర్ ప్రక్రియ’ కూడా రాజకీయనాయకులకు సంబంధించిన వారికి అనుకూలంగా నడుస్తోంది. ఫలితంగా అర్హతలేని వ్యాపారులు కూడా షాపుల యజమానులుగా మారిపోతున్నారు. నిజంగా నిజాయితీగా వ్యాపారం చేయాలనుకునేవారు తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు..
పోలీసులు కాదు మాఫియాకి రక్షకులు :
చట్టపరంగా మద్యం షాపుల అక్రమ కార్యకలాపాలపై పర్యవేక్షణ పోలీసుల బాధ్యత. కానీ వారే ఇప్పుడు మాఫియా రక్షకులుగా మారిపోయారు. రాత్రి వేళల్లో విక్రయాలు, మైనర్లకు మద్యం విక్రయం, నకిలీ సీసాలు, బ్లాక్ మార్కెట్.. ఒక్కటేమిటి ఎన్నెన్నో అక్రమాలు.. ఇవన్నీ పోలీసుల, ఎక్సయిజ్ శాఖ వారి అనుమతితోనే జరుగుతున్నాయి. ఎందుకంటే వారికి లక్షల్లో లంచాలు అందుతున్నాయి..
అదీ కాకుండా మద్యం వ్యాపారులు రాజకీయ నాయకులతో కలిసి ఉన్నప్పుడు వారిపై ఏ కేసు నమోదుకావడం లేదు. ఎవరైనా జర్నలిస్టు లేదా సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేస్తే మాత్రం వారికి నరకం చూపిస్తారు.. వారిని వేధింపులకు గురిచేస్తారు.
టీఆర్ఎస్ హయాంలో కొండంత అవినీతి :
ఇప్పుడు కాంగ్రెస్ దానిని కాపాడుతోంది :
మద్యం వ్యాపారంలో అవినీతి కొత్తది కాదు కానీ టీఆర్ఎస్ పాలనలో అది కొండంతగా పెరిగింది. షాపుల సంఖ్యను కృత్రిమంగా పెంచడం, దూర నియమాలను ఎత్తేయడం, లైసెన్సుల కేటాయింపులో రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం.. ఇవన్నీ సర్వ సాధారణమయ్యాయి. రాష్ట్ర ఆదాయం పెరిగిందనే పేరుతో ప్రభుత్వం మద్యం ఆదాయంపైనే ఆధారపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను సరిచేయాల్సింది పోయి, అదే విధంగా కొనసాగిస్తోంది. పాత మాఫియా నెట్‌వర్క్ అలాగే కొనసాగుతూనే ఉంది. పేర్లు మారినా వ్యాపారం పాత పద్ధతిలోనే నడుస్తోంది.
అమాయక ప్రజలపై తీవ్ర దుష్ప్రభావం :
ఈ విచ్చలవిడిగా సాగుతున్న మద్యం వ్యాపారం చివరికి మోయాల్సిన భారం సామాన్య ప్రజలపైనే పడుతోంది.. కుటుంబాల ఆర్థిక స్థితి కూలిపోతోంది. మద్యం వ్యసనం వల్ల గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య సమస్యలు భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి.
యువత మత్తు వ్యసనంలో పడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వెనుక కూడా మద్యం వ్యసనం ఒక కారణంగా మారింది. దురదృష్టం ఏమిటంటే ప్రజల ఆరోగ్యం, భద్రత కాపాడాల్సిన ప్రభుత్వం ఈ వ్యాపారానికి దాసోహం అయిపోవడం అత్యంత బాధాకరం.
మార్పు రావాలంటే కేవలం చట్టాలు చేస్తే సరిపోదు :
న్యాయమైన సంకల్పం కూడా అవసరం :
మద్యం మాఫియాను అడ్డుకోవాలంటే చట్టాలకంటే ముందుగా రాజకీయ సంకల్పం అవసరం. లైసెన్సుల కేటాయింపులో పూర్తిగా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కోర్టు తీర్పులను కఠినంగా అమలు చేయాలి. అక్రమ షాపులను వెంటనే మూసివేయాలి.
మైనర్లకు విక్రయంపై జీరో టోలరెన్స్ విధానం ఉండాలి. ఎక్సైజ్ శాఖ, పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య ఉన్న మైత్రిని విచ్ఛిన్నం చేయాలి. ప్రభుత్వం వసూలు చేసే పన్ను కోసం ప్రజల జీవితాలు పణంగా పెట్టే విధానం ప్రజాస్వామ్యంలో కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలి..
చివరగా చెప్పుకునేది ఏమిటంటే.. తెలంగాణలో మద్యం వ్యాపారం ఇప్పుడు వాణిజ్యం కాదు.. అది ఒక రాజకీయ మాఫియా వ్యవస్థ. చట్టాలు కేవలం కాగితాల మీదే ఉన్నాయి. కోర్టు తీర్పులు పుస్తకాలలోనే మిగిలాయి. అధికారుల బాధ్యతలు కమిషన్ ప్రక్రియలో కరిగిపోయాయి. ప్రజల జీవితం, ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ మత్తులో మునిగిపోయాయి.
ఈ వ్యవస్థను చెరిపేసేది ఒకే ఒక మార్గం ఏమిటంటే.. కఠినమైన చట్ట అమలు, ప్రజల వత్తిడి.. లేకపోతే ఈ మాఫియా రాక్షసం ప్రతి ప్రభుత్వాన్ని మత్తులో ముంచుతూనే ఉంటుంది. దీనిపై పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
