ప్రజల రక్తాన్ని పీలుస్తున్న పాలకులు..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- అగ్నికి ఆజ్యం పోసినట్లు సహకరిస్తున్న అవినీతి అధికారులు..
- ప్రజా ధనాన్ని దోచుకుతింటున్న రాక్షస బంధం..
- ఎవరు అధికారంలో ఉంటే వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న దౌర్భాగ్యం..
- తీసుకునే జీతాలు ప్రజలు కట్టే పన్నులతో.. ఊడిగం చేసేది రాజకీయ నాయకులకు..
- ఏ ఒక్కరో జిజాయితీపరులున్నా వారిని అణగద్రొక్కుతున్న దుర్మార్గం..
- బ్యూరోక్రాట్స్ సైతం మంత్రులకు సామంతులకు ఒంగి దండాలు పెడుతున్న వైనం..
- ప్రజలు ఓట్లేస్తారు.. పదవులు కట్టబెడతారు.. నరకం కూడా వారే అనుభవిస్తారు..
- సహనానికి కూడా ఒక హద్దుంటుంది.. అది బ్రద్దలైతే ఉపద్రవం ముంచుకొస్తుంది..
- ప్రజాగ్రహానికి బలై, కుదేలైపోయిన నేపాల్ చరిత్రను గుర్తుంచుకోవాలి..
- తీసుకుంటున్న జీతాలకు, అనుభవిస్తున్న పదవులకు న్యాయం చేయాలి..
- పరిస్థితి చేజారకముందే మేలుకోవాలని ప్రభుత్వాలను, అధికారులను హెచ్చరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ :..

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలకే పరిమితం కాదు. అది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన, న్యాయం జరిగే వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థనే రాజకీయ నాయకులు, కొంతమంది బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి కలుషితం చేస్తే ప్రజాస్వామ్యానికి అర్ధం అనేది ఉండదు.. దేనికైనా ఒక హద్దు ఉంటుంది.. అలాగే ప్రజలకు కూడా కొంత సహనం ఉంటుంది.. ఆ సహనం ఆగ్రహంగా మారితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ప్రజాగ్రహానికి గురై పతనమైపోయిన రాజ్యాల ఉదాంతాలు ఎన్నెన్నో చూశాం.. తాజాగా మన కళ్ళముందు నేపాల్ పరిస్థితులు ఒక హెచ్చరిక చేశాయి.. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మేలుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయి..
ప్రజల విన్నపాలు, ఫిర్యాదులు అధికార యంత్రాంగానికి చేరినా, స్పందన మాత్రం శూన్యం. ఫైళ్ళు మూలుగుతూ, పత్రాలు పాడైపోతూ ఉండిపోతున్నాయి. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ప్రజాస్వామ్యానికి తీరని అవమానం. అధికారంలో ఉన్నవారు ప్రజలు మర్చిపోతారు అనే మానసిక రుగ్మతతో వ్యవహరిస్తుండటం మరింత ప్రమాదకరం.
కోర్టు ఆదేశాల ధిక్కారం :
కోర్టు అనేది ప్రతి వ్యక్తికీ చివరి ఆశ్రయం. కానీ ఆ కోర్టు ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం ఈ సమాజానికి ఏ విధమైన సందేశం ఇస్తోంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయపాలనకు మించి ఉన్న శక్తి ఏదీ లేదు. అయినప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను విస్మరించడం, మేమే మోనార్కులం అన్న దౌర్జన్యం ప్రదర్శించడం ప్రజాస్వామ్య పునాదులకే గుదిబండ లాంటిది..
నేపాల్ లో సంభవించిన పరిస్థితులు గమనించాలి :
నేపాల్ రాజకీయ వ్యవస్థలో అవినీతి, అస్థిరత, న్యాయపాలన విస్మరణ వలన ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ప్రభుత్వాల మార్పులు జరిగినా ప్రజల జీవన స్థితి మారలేదు. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా చూసుకోవడం పాలకుల ప్రధాన బాధ్యత. లేకపోతే దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగి పెద్ద పెద్ద పరిణామాలకు, ప్రమాదాలకు దారి తీస్తాయి.
పరిష్కార మార్గం లేదా..? :
రాజకీయం అవినీతిపరులను కాపాడే సంస్కృతి ఆగాలి. పరిపాలన పారదర్శకత: ప్రతి రూపాయి ఖర్చు పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి.
న్యాయపాలన కట్టుదిట్టంగా జరగాలి.. కోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు కావాలి. అవినీతి ఎక్కడైనా బయటపడితే ప్రజలు వెనుకడుగు వేయకూడదు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి..
ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు అవినీతి. పాలకులు, అధికారులు కలిసి ప్రజల ధనాన్ని దోచుకోవడం నేరం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును బలి తీసుకోవడం కూడా. శ్రీలంక, నేపాల్ ల పరిస్థితి భారతదేశంలో రాకూడదంటే పాలకులు నిజమైన బాధ్యతాయుత వైఖరిని అవలంబించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. ఇది ఎంతో అవసరం కూడా..
