పవిత్రమైన శాసనాలు చేయాల్సిన సభ..

- దూషణలకు వేదికగా మారుతున్న దౌర్భాగ్యం.. 
- ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్న నేతలు.. 
- కోట్ల ప్రజాధనం వృధాగా పోతున్నా పట్టింపులేదు.. 
- అసలు ఒక్కటైనా ప్రజా సమస్య పట్ల చర్చ జరుగుతోందా..? 
- అందుకేనా మిమ్మల్ని గెలిపించుకుంది.. 
- ఇందుకోసమేనా పన్నులు కట్టి మిమ్మల్ని పోషిస్తున్నది..? 
- దేవాలయం లాంటి అసెంబ్లీని దయ్యాల గుహలా  మారుస్తున్నారు..
- కోట్లాదిమంది ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేదా..? 
- ఒకరేమో బట్టలు ఊడదీస్తామంటారు.. 
- మరొకరేమో నాలుక కత్తరిస్తామంటారు.. 
- రాజ్యాంగబద్ధమైన చట్టసభల్లో ఉన్నారా..? రౌడీల్లా బజార్లో ఉన్నారా..? 
- సిగ్గూ ఎగ్గూ లేని నాయకుల్లారా మీకు ఎలా చెబితే అర్ధం అవుతుంది..?

- శాసనసభ వ్యవహారాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం..

పవిత్రమైన శాసనాలు చేయాల్సిన సభ..

శాసనసభ సమావేశాలు: ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంలా ఉండాలా..? కుహనా రాజకీయాలకు నాటక వేదికలుగా ఉండాలా..? సో కాల్డ్ రాజకీయ నాయకులారా మీ గుండెలపై చేయివేసుకుని ఒక్కసారి ఆలోచించండి.. మీరు తిట్టుకోవడానికి ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవడానికి కోట్లు ఖర్చుపెట్టి నిర్వహిస్తున్న అసెంబ్లీని వేదికకా మార్చుకుంటున్నారు  కాస్తైనా ఇంగితజ్ఞానం ఉండాలి కదా..? ఎలా చెబితే మీకు అర్ధం అవుతుంది..? ఏ చెప్పుతో కొడితే దారికి వస్తారు..? ఇది సామాన్యుడు అనుకుంటున్నా మాట.. అక్షరాల్లో రాయడానికి మాకు సిగ్గుగా ఉంది.. కానీ తప్పడం లేదు..  నిన్నటికి నిన్న సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నీటి వ్యవహారాలపై మాట్లాడుతూ బీ.ఆర్.ఎస్. నేతలపై  విరుచుకు పడ్డారు.. నాలుక కోసేస్తానని, ఇవి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అనుకుంటే రికార్డులనుండి తొలగించమని, ప్రజలకు అర్ధం కావడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానని చెప్పడం దేనికి సంకేతం..? మీ పెర్సనల్ కోపాలు ప్రదర్శించుకోవడానికి కాదు కదా అసెంబ్లీ ఉన్నది.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు, మేధావులు, సామాజిక వేత్తలు, విశ్లేషకులు..  సమాధానం చెప్పండి సార్.. 

హైదరాబాద్ : 
  
అసలు శాసనసభ సమావేశాలు అంటే ఏమిటి? అవి అధికార పక్షం, విపక్షం పరస్పరం దూషించుకునే వేదిక కాదు. అవి అరుపులు, హంగామా, వాక్‌ఔట్ల కోసం నిర్వహించే కార్యక్రమాలు కావు. నిజానికి శాసనసభ అంటే.. ప్రజల గళం వినిపించే సభ..  ప్రజా సమస్యలపై చర్చ జరిగే వేదిక..  ప్రజా ధనం ఎలా ఖర్చవుతుందో ప్రశ్నించే ఒక కార్యాలయం.. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు రూపుదిద్దుకునే అద్భుత కేంద్రం.. 

శాసనసభ సమావేశాల అసలు ఉద్దేశ్యం ఏమిటి? అందరూ తెలుసుకోవాలి.. పవిత్రమైన శాసనాలు చేయాల్సిన సభ..

ప్రజా సమస్యలపై చర్చ :

రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం, విద్య–వైద్యం, ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల అమలు.. ఇలాంటి విషయాలు శాసనసభ చర్చల కేంద్ర బిందువులు కావాలి. కానీ వాస్తవంలో వ్యక్తిగత విమర్శలు, రాజకీయ కక్షలే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ప్రభుత్వంపై నియంత్రణ తీసుకువచ్చే వేదిక అసెంబ్లీ..   అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? ప్రజా ధనం ఎక్కడ ఖర్చవుతోంది? ఎంత ఖర్చు అవుతోంది..?  ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా? ఇవన్నీ ప్రశ్నించాల్సింది శాసనసభలోనే.

చట్టాల రూపకల్పన :

ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలి. ఉన్న చట్టాల్లో లోపాలుంటే సవరించాలి. కానీ నేడు బిల్లులు చర్చ లేకుండా, గంటల్లోనే ఆమోదం పొందుతున్నాయి. ప్రజా ధన వినియోగం పై చర్చ జరగాలి..  శాసనసభ సమావేశాలకు రోజుకు కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఆ ఖర్చు రాజకీయ డ్రామాల కోసం కాదు.. ప్రజా ప్రయోజనాల కోసం. సభలో ప్రతి విషయానికి అడ్డుపడే పద్ధతి ఏదైతే వుందో.. ఆపద్ధతి ప్రజా ధనాన్ని తగలబెట్టేస్తోంది.. WhatsApp Image 2026-01-09 at 18.43.27 (1)

అసలు అధికార పక్షం పాత్ర ఏంటి? :

అధికారంలో ఉన్నది పాలించడానికి, సమాధానం చెప్పడానికి. విపక్షాన్ని అణిచివేయడానికి కాదు. ప్రజా సమస్యలపై చర్చకు భయపడితే అది ప్రజాస్వామ్యంపై అవిశ్వాసం ప్రకటించినట్లే.. 

విపక్షాల బాధ్యత ఏంటి? :

విపక్షం అంటే ప్రతి దానికి అడ్డుపడటమే కాదు. నిజాయితీగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాలి. విధానాలపై గట్టి చర్చ చేయాలి.
కానీ సభను పూర్తిగా స్తంభింపజేయడం ద్వారా ప్రజలకు ద్రోహం చేయకూడదు.

నేటి శాసనసభలు: ఒక చేదు వాస్తవం :

సభ నడవకుండానే రోజులు ముగుస్తున్నాయి..  ప్రజా సమస్యలు పక్కకు నెట్టబడుతున్నాయి.. వ్యక్తిగత విమర్శలే మీడియాలో హెడ్‌లైన్లు అవుతున్నాయి.. దీంతో ప్రజలు శాసనసభపై విశ్వాసం కోల్పోతున్నారు..  నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.

మార్పు ఎక్కడ నుంచి రావాలి? :

సభ్యులకు శాసనసభ అంటే సేవ అనే భావన రావాలి.. ప్రజలు తమ ప్రతినిధులను ప్రశ్నించాలి.. మీడియా అరుపులకన్నా విషయాలను హైలైట్ చేయాలి.. బాధ్యతగా వ్యవహరించాలి..  సభకు ఎవరైనా సరే అడ్డుపడితే ప్రజలే కాలరు పట్టుకుని నిలదీసి అడగాలి.. 

శాసనసభలు ప్రజల ఆస్తి. అవి రాజకీయ యుద్ధభూములు కావు..  ప్రజా భవితవ్యం రూపుదిద్దుకునే ఆలయాలు. అక్కడ మాటకు అర్థం ఉండాలి… చర్చకు గౌరవం ఉండాలి…తీర్మానాలకు బాధ్యత ఉండాలి… అప్పుడే శాసనసభలు నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకలవుతాయి. దయచేసి అందరూ ఒకసారి ఆలోచించాలి..

About The Author