ప్లాస్టిక్ రహిత సిద్దిపేటే లక్ష్యం

  • - స్వచ్ఛ సిద్దిపేట కోసం అందరి సహకారం అవసరం
  • - మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్

ప్లాస్టిక్ రహిత సిద్దిపేటే లక్ష్యం

సిద్దిపేట:

 సిద్దిపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తెలిపారు. గురువారం సిద్దిపేట పురపాలక సంఘ కార్యాలయంలో పట్టణంలోని ప్లాస్టిక్ దుకాణ సముదాయాల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సిద్దిపేట అందమైన పట్టణమని, దాని పరిశుభ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, ప్రజల సహకారంతో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరుబయట చెత్త వేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్‌ను ఆదేశించారు.
జూన్ మొదటి వారం నుంచి పట్టణంలోని ఫంక్షన్ హాల్స్, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, మాంసాహార విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తామని వెల్లడించారు. చెరువులు, కుంటలు, రహదారుల వెంట బ్లాక్ స్పాట్స్ పెరుగుతున్నాయని, వాటి నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులను వినియోగించాలని, జ్యూట్ బ్యాగ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించాలని దుకాణ యజమానులకు సూచించారు. అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author