బీసీ ప్రభంజనం ఎంపీ ఈటెల రాజేందర్ కు ఆహ్వానం
సత్యనారాయణ, కిషన్ ల విజ్ఞప్తి
ఎల్బీనగర్:
బీసీ ప్రభంజనం సభకు హాజరు కావాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను బీసీ ప్రభంజనం నాయకులు ఉప్పు సత్యనారాయణ, జాల కిషన్ లు ఆహ్వానించారు. బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ, టియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు జాల కిషన్ ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మే 24 న ఎల్బీనగర్ ఎస్ కె గార్డెన్స్ లో జరగనున్న బీసీ ప్రభంజనం సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎంపీ రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్న ఈ సభ బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి దోహద పడుతుంది అని సత్యనారాయణ, కిషన్ లు వివరించారు. అఖిలపక్షం నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల బీసీ నాయకులు హాజరు అవుతున్నారు అని ఎంపీ రాజేందర్ కు బీసీ ప్రభంజనం నేతలు తెలిపారు. జనాభా ప్రాతిపదికన అన్ని ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభంజనం నాయకులు ఎంపీ కి వివరించారు. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలతో పాటు బీసీ సంఘాల నాయకులు, విద్యావంతులు, మేధావులు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటారు అని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీసీలు ప్రాణ త్యాగం చేశారని ఎల్బీనగర్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో బీసీల ముద్దు బిడ్డలు శ్రీకాంత్ చారి, సిరిపురం యాదయ్య వంటి వారు ఉన్నారు అని బీసీ ప్రభంజనం సమన్వయకర్త టియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు జాల కిషన్ వివరించారు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఎస్సీ ఎస్టీ బీసీ జెఎసి కన్వీనర్ తెలంగాణ వెంకన్న డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ పెంచడానికి మద్దతు ఇస్తున్నారు కానీ చట్టపరంగా బీసీ బిల్లు ఎందుకు ఆమోదం పొందడం లేదని ఆయన ప్రశ్నించారు. బహుజనల రాజ్యం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం కావాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.
