ఉల్లాస్ కార్యక్రమంతో మహిళల సాధికారతకు బాటలు
- కమిషనర్ అశ్రిత్ కుమార్
సిద్దిపేట
సమాజంలో ప్రతి మహిళ అక్షరాస్యురాలిగా మారి సాధికారత సాధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో నిర్వహించిన ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం సందర్భంగా సంఘ స్థాయి సమాఖ్య పరిశీలకులు, వనరుల వ్యక్తులకు ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.చదువుకునే అవకాశం కోల్పోయిన 15 సంవత్సరాలు పైబడిన మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణ పరిధిలో మహిళా సంఘాల్లో దాదాపు 1300 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారికి స్వచ్ఛందంగా చదువు చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.ప్రతి వనరుల వ్యక్తి, పరిశీలకుడు కనీసం పది మంది నిరక్షరాస్యులకు విద్యాబోధన చేయాలని సూచించారు. మహిళ అక్షరాస్యురాలైతే కుటుంబం, సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదవడం, రాయడం మాత్రమే కాకుండా మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించి స్వేచ్ఛా విద్యా విధానం ద్వారా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివించే అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే మహిళలకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ సమన్వయకర్త హన్మంత్ రెడ్డి, రెవెన్యూ అధికారి శ్రీకాంత్, విద్యాశాఖ ప్రతినిధి శ్రీనివాస్, సమన్వయ అధికారులు రేణుక, జ్యోతి, సంఘ స్థాయి సమాఖ్య ప్రతినిధులు, వనరుల వ్యక్తులు పాల్గొన్నారు.
