ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
- - తిమ్మాపూర్‌లో బడి బాట కార్యక్రమం ప్రారంభం
- - తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్
సిద్దిపేట:
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రయివేట్ పాఠశాలలకు బదులుగా సర్కార్ బడుల్లోకే వారి పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లితండ్రులకు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, పెంటయ్య సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో గురువారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు రాజమౌళి, పెంటయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారం అని పేర్కొంటూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు చైతన్యం కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు గ్రామ ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వన్నెల విజయ్ కుమార్, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, కవిత, రాములు, సరిత, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
