బక్రీద్ పండుగకు పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు
సిద్దిపేట:
బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని, ముఖ్య రహదారులు మరియు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జిల్లా పరిధిలో 24 గంటల పాటు చెక్‌పోస్టులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వాహనాల తనిఖీల కోసం పోలీస్ సిబ్బందితో పాటు వెటర్నరీ శాఖ అధికారులను కూడా నియమించాలని తెలిపారు.మసీదులు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు సోషల్ మీడియాలో అసత్య, చట్టవ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, పరస్పర గౌరవం మరియు మత సామరస్యంతో జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీలు, సీఐలు, వెటర్నరీ మరియు మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు..jpeg)
