వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
నిన్న రాత్రి వీధి కుక్కల దాడిలో అద్విక్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సంఘటన జరిగిన అపార్ట్మెంట్ ప్రాంతాన్ని పర్యటించారు.అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి ప్రాంతంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, సంబంధిత అధికారులయిన ఏఎంఓహెచ్ డాక్టర్ దీప్తి, డాక్టర్ యాదగిరి ఏంటమలాజీ ఏఈ రాంబాబులకు సూచించారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ప్రజల భద్రతే ముఖ్యమని, ముఖ్యంగా చిన్నారులు, మహిళలు,వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్‌ను, చిన్నారి తల్లిదండ్రులను దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సుధీర్ రెడ్డి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి సూచించారు. అద్విక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అలాగే నియోజకవర్గంలో వీధి కుక్కల సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
