కళ్లాల్లో పేరుకుపోయిన వరి ధాన్యం
లారీల కొరతతో రైతుల ఆందోళన
దుబ్బాక:
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కళ్లాల్లో వరి ధాన్యం కుప్పలుగా పేరుకుపోయినా లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు రోజులుగా ధాన్యం తరలింపు నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అకాల వర్షాల భయంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో శ్రమించి పండించిన ధాన్యం తడిసిపోతే భారీ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో రైతులు రాత్రింబవళ్లు ధాన్యం వద్దే కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే తూకం వేసిన ధాన్యం కూడా లారీల లభ్యత లేక కళ్లాల్లోనే నిల్వ ఉండిపోయిందని రైతులు తెలిపారు. అధికారులు సమన్వయంతో వెంటనే లారీలను అందుబాటులోకి తీసుకువచ్చి ధాన్యాన్ని త్వరితగతిన తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల సమస్యలను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
