చదువుల నిలయంగా ఇబ్రహీంపట్నం
- రూ. 3.35 కోట్లతో డిగ్రీ కాలేజీ కొత్త బిల్డింగ్ ప్రారంభం
- పదేళ్ల గోస తీరింది.. ఇకపై సొంత గదుల్లోనే పాఠాలు
- సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా మారుస్తాం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
*ఇబ్రహీంపట్నం
నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని, ఇబ్రహీంపట్నాన్ని సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో రూ. 3.35 కోట్ల నిధులతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యారంగం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పిల్లల భవిష్యత్తు కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.
షిఫ్టుల కష్టాలకు చెక్!
గత దశాబ్ద కాలంగా జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు ఒకే భవనంలో షిఫ్టుల వారీగా క్లాసులకు హాజరవుతూ పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ప్రస్తావించారు. "గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ భవనం పూర్తి కావడానికి ఇన్నేళ్లు పట్టింది. విద్యార్థుల కష్టాలు చూసి ప్రత్యేక చొరవ తీసుకున్నాం" అని మల్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త భవనంలో ల్యాబ్‌లు, లైబ్రరీ, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన.. విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగానే ఆరుట్లలో పబ్లిక్ స్కూల్, నియోజకవర్గానికో 'యంగ్ ఇండియా' స్కూల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారబోతున్నాయని, రైజింగ్ తెలంగాణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు.
విద్యారంగంపై 'ప్రజాప్రతినిధుల' మథనం
*గురుకుల విద్యాపీఠ్‌లో అవగాహన సదస్సు
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల సందర్భంగా గురుకుల విద్యాపీఠ్‌లో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.. సర్పంచులు, కౌన్సిలర్లతో కలిసి విద్యారంగ సమస్యలపై చర్చించారు.
నాణ్యమైన బోధన: మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు అప్డేట్ కావాలని, ప్రభుత్వ బడుల్లో ఉత్తమ ఫలితాలు రావాలని సూచించారు.
ప్రజాప్రతినిధుల బాధ్యత: బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని కోరారు.
