చెరువులకు 'హైడ్రా' కెమెరా కవచం
900 సీసీటీవీలతో నిరంతర నిఘా.. కబ్జాలకు ఇక బ్రేక్!
హైదరాబాద్:
నగరంలోని చెరువుల రక్షణ కోసం హైడ్రా (HYDRAA) మరో కీలక అడుగు వేసింది. చెరువుల కబ్జాలను అడ్డుకోవడానికి, అక్రమ నిర్మాణాలను నిరోధించడానికి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా 264 చెరువుల పరిధిలో సుమారు 900 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, సోమవారం నుంచి నిరంతర నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు హైడ్రా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వర్‌కు ఈ కెమెరాలను అనుసంధానించారు. ఈ నూతన నిఘా వ్యవస్థను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు.
నిమిషాల్లోనే వాహనాల గుర్తింపు
సాధారణంగా చెరువులను ఆక్రమించే వారు అర్ధరాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలను (C&D Waste), మట్టిని తెచ్చి చెరువు కుంటల్లో నింపేస్తుంటారు. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.
వాహనాల ట్రాకింగ్: మట్టిని అక్రమంగా తరలించే వాహనాల నంబర్ ప్లేట్లను సీసీటీవీల ద్వారా గుర్తించి, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
లేక్ ప్రొటెక్షన్ టీమ్స్ అలర్ట్: కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది, ఏదైనా అక్రమం జరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే క్షేత్రస్థాయిలో ఉన్న లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీమ్స్‌ను అప్రమత్తం చేస్తారు.
చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ఈ కెమెరాల దృశ్యాలను హైడ్రా కార్యాలయంతో పాటు బంజారాహిల్స్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)' కు కూడా అనుసంధానం చేశారు. దీనివల్ల నిఘా మరింత పటిష్టంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టీమ్స్‌కు ఈ టెక్నాలజీ తోడవ్వడంతో చెరువుల రక్షణ వ్యవస్థ మరింత బలపడిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
కీలక అంశాలు:
మొత్తం చెరువులు:* 264
*ఏర్పాటు చేసిన కెమెరాలు:*900
ఈ కార్యక్రమంలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అదనపు కమిషనర్ ఆర్. సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నగర సంపదైన చెరువులను కాపాడటంలో ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరారు.

