రైతును నిలువునా ముంచేందుకు 'నకిలీ' పంజా!
- శామీర్‌పేట వద్ద 100 కిలోల నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాల సీజ్*
- గుంటూరు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడి అరెస్ట్
- మదనపల్లి నుంచి అక్రమ రవాణా.. ఎస్‌ఓటీ మెరుపు దాడి
శామీర్‌పేట:
అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అక్రమ లాభాలే ధ్యేయంగా సాగుతున్న నిషేధిత విత్తనాల దందాను మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) రట్టు చేసింది. సాగు సీజన్ ప్రారంభం కాకముందే అన్నదాతలను మోసం చేసేందుకు సిద్ధమైన ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు విప్పారు. శామీర్‌పేట శివారులో నిర్వహించిన మెరుపు దాడుల్లో రూ. లక్షల విలువైన 100 కిలోల బీటీ-3 (BG-III HP) రకం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద నిఘా*
నమ్మదగిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ కంటోన్మెంట్ బృందం, వ్యవసాయ శాఖ అధికారులు మరియు శామీర్‌పేట పోలీసులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ నంబర్ 07 వద్ద మాటు వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచులతో వెళ్తున్న గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన *దాసరి శ్రీనివాసరావు (58)* అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు బ్యాగులను తనిఖీ చేయగా.. పర్యావరణానికి, పంట భూములకు తీవ్ర హాని కలిగించే నిషేధిత బీటీ-3 విత్తనాలు బయటపడ్డాయి.
నిందితుడు శ్రీనివాసరావు తన సహచరుడైన దాసరి సూరిబాబుతో కలిసి అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మరో శ్రీనివాసరావు వద్ద ఈ విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. వీటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైతులు మరియు ఫెర్టిలైజర్ దుకాణదారులకు భారీ ధరకు విక్రయించి లాభపడాలని పథకం వేశాడు. కాగా, ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులైన మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
మళ్ళీ అదే బాట..*
అరెస్టయిన నిందితుడు శ్రీనివాసరావు పాత నేరస్థుడని పోలీసులు గుర్తించారు. గతంలో వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నిషేధిత విత్తనాలను విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. పాత కేసులు ఉన్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా నిందితుడు మళ్లీ అదే దారి పట్టడం గమనార్హం.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేని, శాస్త్రీయంగా ధృవీకరించని బీటీ-3 రకం విత్తనాల వల్ల సాగు భూములు విషతుల్యం అవుతాయని హెచ్చరించారు. "వీటి వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు సదా, నేల కాలుష్యం పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతారు" అని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.
పోలీసుల చర్యలు
ఈ ఘటనపై శామీర్‌పేట పోలీసులు *Cr. No. 383/2026* కింద భారతీయ న్యాయ సంహిత (BNS), పర్యావరణ పరిరక్షణ చట్టం, విత్తన నియంత్రణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఓటీ అదనపు డిసిపి నంద్యాల నరసింహారెడ్డి, ఇన్ స్పెక్టర్ కె. శ్రీనివాస్, శామీర్‌పేట ఎస్ హెచ్‌ఓ ఎస్. శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు..jpeg)
