ప్రైవేటు విద్యాలయాల్లోనూ ‘స్కౌట్స్’ విస్తరించాలి
- * రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- * బీఎస్‌జీ ప్రతినిధి బృందంతో భేటీ.. పురోగతిపై హర్షం
హైదరాబాద్:
రాష్ట్రంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్‌జీ) కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలను ఈ ఉద్యమంలో పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. బుధవారం రాజ్‌భవన్‌లో బీఎస్‌జీ రాష్ట్ర ప్రధాన కమిషనర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై గవర్నర్ సమీక్షించారు.
ప్రతి పాఠశాలలోనూ ఒక యూనిట్
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో స్కౌటింగ్ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది. ఈ సందర్భంగా ఎం.దానకిశోర్ మాట్లాడుతూ..
* ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,200 యూనిట్లు' పనిచేస్తుండగా, '30 వేల మందికి పైగా విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.
* మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు, గవర్నర్ ఫండ్స్ వినియోగిస్తున్నాం.
వచ్చే ఏడాది మరో వెయ్యి పాఠశాలల్లో..
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, బీఎస్‌జీ రాష్ట్ర కార్యదర్శి డా. ఈ. నవీన్ నికోలస్ మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారంతో గతేడాది వెయ్యి పాఠశాలలను సంస్థలో చేర్చామని వివరించారు. 2026-27 విద్యా సంవత్సరంలో మరో వెయ్యి పాఠశాలలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శిక్షణ కేంద్రాల్లో కల్పిస్తున్న వసతులు యువతలో నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను పెంపొందించడానికి తోడ్పడతాయని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన గవర్నర్
భక్త రామదాసు సంకీర్తనల మాధుర్యాన్ని భావితరాలకు అందించేలా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రూపొందించిన నూతన కోర్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. బుధవారం లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 'భక్త రామదాసు కీర్తనలు - ఏడాది ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సు'ను ఆయన ఆవిష్కరించారు.
సంగీత, సాహిత్య అభిమానులకు ఈ కోర్సు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వవిద్యాలయ ఉపకులపతి వి.నిత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
