నీట్ ‘లీకేజీ’పై యూత్ కాంగ్రెస్ నిప్పులు
- మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మల దగ్ధం..
రాజీనామాలకు డిమాండ్. - విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్రం: శివచరణ్ రెడ్డి.
హైదరాబాద్:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం హిమాయత్‌నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంధకారంలో 24 లక్షల మంది భవిష్యత్తు
నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని శివచరణ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మలను కార్యకర్తలు దహనం చేశారు.
శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. "మోదీ పదేళ్ల పాలనలో దేశంలో ఏకంగా 89 సార్లు పేపర్ లీకులు జరగడం సిగ్గుచేటు. వీటివల్ల 48 సార్లు పరీక్షలను తిరిగి నిర్వహించాల్సి వచ్చింది. వరుసగా లీకులు జరుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.
తక్షణమే రాజీనామా చేయాలి
పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం మొండివైఖరి వీడకుంటే విద్యార్థులు, యువత పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ శివంత రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
