అనుమతులు లేకుండా అడ్డగోలుగా సుద్ధ తవ్వకాలు!
- - సర్వే నెంబర్ 52/బి/2లో అక్రమంగా చొరబడి సుద్ధ తవ్వకాలు.
- - వారం రోజులు ఊరెళ్ళి వచ్చేసరిక యంత్రాల మోత.
- - సుమారూ రూ.4 లక్షల అక్రమ సుద్ధ తవ్వకాలు జరిపారు.
- - అధికారుల నిర్లక్ష్యంపై రైతు ఆగ్రహం.
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా, తాండూర్ నియోజకవర్గం, పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో ఎలాంటి లీజు అనుమతులు లేకుండానే మూడు రోజుల పాటు సుద్ధ తవ్వకాలు జరిపారని రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీలు, టిప్పర్లతో తమ పొలంలోకి అక్రమంగా చొరబడి సుద్ధ తీశారని ఆరోపించారు.ఇందుకు సంబంధించి రైతు "మాదారం బాల్ రెడ్డి" తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ... గత వారం రోజులపాటు బంధువుల ఇంటికి వెళ్ళాము. నిన్న(మంగళవారం) తిరిగి స్వగ్రామానికి వచ్చి తమ పొలం దగ్గరకు వెళ్లి చూసేసరికి, గోపాల్పూర్ గ్రామానికి చెందిన "మాదారం సంజీవరెడ్డి",మాదారం మహేందర్ రెడ్డి ఇద్దరు కలిసి తన పొలంలో అక్రమంగా సుద్ధ తవ్వకాలు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు, రాయల్టీలు లేకుండానే గోపాల్పూర్ గ్రామంలో అక్రమంగా సుద్ధ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.ఒకవేళ అనుమతులు ఉన్న...అనుమతులు ఒక చోట ఉంటే, సుద్ధను మరో చోట నిల్వలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో కేసు ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరించి తన పొలంలోకి చొరబడ్డారని పేర్కొన్నారు.ఇంత బహిరంగంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎందుకు స్పందించకపోవడం లేదని, ఒకవేళ సుద్ధ వ్యాపారులతో కుమ్మక్కయ్యారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు లీజు లేకుండా తవ్వకాలు ఎలా కొనసాగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని పలువురు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
