ఆదివాసీలు ఐక్యతను చాటాలి
-అటవీ కార్యాలయ ముట్టడికి సిద్ధం కావాలి
- పిలుపునిచ్చిన రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ
మణుగూరు:
ఆదివాసీలకు కన్నతల్లి లాంటి అడవిని వక్రమార్గంలో నరికి అక్రమానికి రాజమార్గం వేసిన అటవీ అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఆదివాసీలు ఐక్యతతో అటవీ కార్యాలయ ముట్టడికి సిద్ధం కావాలని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ పిలుపునిచ్చారు. గురువారం అంబేద్కర్ సెంటర్లలో గల రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పోడు భూముల విషయంలో ఆదివాసులను ముప్పుతిప్పలు పెట్టి, ఆదివాసులు ఏర్పాటు చేసిన నివాసాలను తొలగించి అవి తమ భూములు అంటూ... వేదాలు వల్లించి అనేక ఇబ్బందులకు గురి చేసి అమాయకులను మానసిక క్షోభకు గురి చేసే అటవీ అధికారుల దౌర్జన్యంపై అటవీ కార్యాలయం ముట్టడికి వేలాదిగా ఆదివాసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. గుట్టమల్లారం అటవీ భూమి లో వేలాది వృక్షాలు నరికి ఫోర్ లైన్ రోడ్లు వేసి భారీగా ముడుపులు తీసుకున్న అటవీ అధికారులు ప్రాణం కన్నా ఎక్కువ అటవి నీ ప్రేమించే ఆదివాసులకు, ఏజెన్సీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి మెప్పు కోసం అటవీ అధికారులు వేలాది చెట్లు నరికి రోడ్డు నిర్మించారని ప్రశ్నించారు. ఇసుక ర్యాంప్ నిర్వహణ కు అటవీ అధికారులు రహదారులు నిర్మించి ఇసుక మాఫియా కు మేలు చేకూర్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెన్నెల జలపాతం వద్ద పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించకుండానే ప్రజలకు పెద్దగా తెలియని స్వప్న జలపాతానికి దారి అంటూ ప్రజలను పక్కదారి పట్టించి ఏజన్సీ నియోజకవర్గంలో అమాయకపు ఆదివాసీ ప్రజలను అటవీ అధికాలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి ఇష్టానుసారంగా అడవి నరికి ఇసుకసురులకు రోడ్డును పరిచిన వైనంపై, 30 ఎకరాల ఫారెస్ట్ భూమికి పట్టా చేసిన వైనంపై ఫిర్యాదు చేస్తామని, అనంతరం ఆదివాసీల ఐక్యతతో ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఖాళీ భూములను నిరుపేద గిరిజనులకు పంచే వరకు శ్రమిస్తామని తెలిపారు.
