హిమాలయాల్లో 18 ఏళ్లుగా అన్నదాన సేవలు
- - లక్షలాది మంది భక్తులకు వసతుల కల్పన
- ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట కేదార్‌నాథ్ అన్న సేవా సమితి
సిద్దిపేట:
"అన్నదానం మహాదానం" అనే భావాన్ని ఆచరణలో చూపిస్తూ కేదార్‌నాథ్ యాత్రలో సిద్దిపేట సేవా స్ఫూర్తి భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. 2019లో కేవలం 50 మంది సభ్యులతో ప్రారంభమైన కేదార్‌నాథ్ అన్న సేవా సమితి, నేడు 150 మందికి పైగా సభ్యులతో విస్తరించింది. హిమాలయాల్లోని పరమశివుడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నపానీయాలు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పిస్తూ నిరంతర సేవలు అందిస్తోంది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సేవాభావంతో ముందుకు సాగుతున్న సమితి సభ్యులు, భక్తులకు అండగా నిలుస్తూ సిద్దిపేట పేరు దేశవ్యాప్తంగా చాటుతున్నారు.2019 నుండి నేటికీ విరమంగా సేవలు అందిస్తున్న సిద్దిపేట అన్న సేవా సమితి కార్యక్రమాలపై భారత శక్తి ప్రత్యేక కథనం.....
సిద్దిపేట నుంచి కేదార్‌నాథ్ క్షేత్రం వరకు సుమారు 1,850 నుంచి 2,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ముందుగా హరిద్వార్, ఋషికేశ్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ చేరుకుని, అక్కడి నుంచి సుమారు 16 కిలోమీటర్ల కొండ మార్గం నడిచి లేదా గుర్రాలు, డోలీల ద్వారా భక్తులు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుంటారు. కేదార్‌నాథ్ యాత్రకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తారు. అలాగే నేపాల్ సహా విదేశాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తుంటారు.
కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం 2019 నుంచి నిరంతరంగా కొనసాగుతోంది. యాత్రికుల కోసం అవసరమైన సరుకులతో కూడిన లారీని ఏప్రిల్ 14న సిద్దిపేట నుంచి పంపగా, మాజీ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించారు. యాత్ర కాలమంతా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.
గౌరికుండ్ నుంచి కేదార్‌నాథ్ ఆలయం వరకు సాగే కఠినమైన పర్వత మార్గంలో యాత్రికులకు అండగా నిలుస్తూ సోన్‌ప్రయాగ్ పార్కింగ్ ప్రాంతంతో పాటు ఆలయ సమీపంలో కూడా అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా సభ్యులు, దాతల సహకారంతో ఈ సేవలు కొనసాగుతున్నాయి.
ఆధ్యాత్మికతకు ప్రతీక కేదార్‌నాథ్ యాత్ర హిమాలయాల మధ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ క్షేత్రం చార్ ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. గౌరికుండ్ నుంచి సుమారు 16 కిలోమీటర్ల పర్వత మార్గాన్ని అధిరోహించి భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు "ఓం నమః శివాయ" నినాదాలతో ఈ మహాయాత్రలో పాల్గొంటారు.
దాతల సహకారంతో సేవలు
2019లో 50 మంది సభ్యులతో ప్రారంభమైన సేవా కార్యక్రమం ప్రస్తుతం 150 మందికి పైగా సభ్యులతో విస్తరించిందన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం, టిఫిన్స్, స్నాక్స్ అందిస్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ సేవాకు మంచి గుర్తింపు
- కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి ప్రధాన కార్యదర్శి అయిత రత్నాకర్
భక్తుల సౌకర్యార్థం సోన్‌ప్రయాగ్‌తో పాటు ఆలయం సమీపంలో కూడా అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమానికి మంచి గుర్తింపు లభిస్తోందన్నారు.
భక్తులకు సేవ చేయడం మా అదృష్టం
- కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితికోశాధికారి గోపిశెట్టి
సిద్దిపేట నుండి వచ్చి ఇక్కడ భక్తులకు సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సభ్యులంతా అంకితభావంతో సేవలు కొనసాగిస్తున్నాం.

.jpeg)
