తెలంగాణలో ఎడ్యుకేషన్ మాఫియా బరితెగింపు:
- *నిలువునా మునుగుతున్న తల్లిదండ్రులు.. 'కార్పొరేట్' మాయాజాలంలో బాల్యం బలి
- *రూ. వేల కోట్ల విద్యా వ్యాపారం.. నిబంధనలు ఇంటర్ బోర్డు ‘కాగితాల’కే పరిమితం
- *ఉత్తరాది మాఫియా చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ.. కోట సంస్కృతితో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు..
"భాగ్యనగర వీధుల సాక్షిగా అక్షరాలు అంగడి సరుకై, బాల్యం కార్పొరేట్ చెరసాలలో బందీ అవుతోంది. దేశాన్ని కుదిపేసిన ‘నీట్’ పేపర్ లీకేజీల ఉత్తరాది మాఫియా మూలాలు, నేడు స్థానిక రాబందులతో జతకట్టి తెలంగాణ విద్యా వ్యవస్థపై నిశ్శబ్ద పంజా విసిరాయి. ర్యాంకుల వేట, నకిలీ మెరుపులతో రూ. వేల కోట్ల దోపిడీకి ‘నో-కాస్ట్ ఈఎంఐ’ల ఉచ్చు బిగుస్తోంది. ఇంటర్ బోర్డు నిస్సహాయత, డమ్మీ నెట్‌వర్క్‌ల అండతో సాగుతున్న ఈ అక్రమ విద్యావ్యాపార సామ్రాజ్యాన్ని ఎండగడుతూ, విద్యార్థుల ఆత్మఘోషపై ‘భారత శక్తి’ అందిస్తున్న ప్రత్యేక పక్షపాత రహిత దర్యాప్తు కథనం.
(పరిశోధనాత్మక పాత్రికేయులు: ఎం.వేణుగోపాల్ రెడ్డి)
హైదరాబాద్:
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య అంటే ఒకప్పుడు అదొక పవిత్రమైన విద్యాదశ. కానీ నేడు అదొక మైండ్ గేమ్.. కొన్ని కోట్ల రూపాయల కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యం! భాగ్యనగరాన్ని హబ్‌గా చేసుకుని విస్తరించిన స్థానిక కార్పొరేట్ దిగ్గజాలు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలతో పాటు, ఉత్తరాది నుంచి ఇక్కడికి అడుగుపెట్టిన అలెన్ (Allen), రెజోనెన్స్ (Resonance), ఫిట్‌జీ (FIITJEE), ఆకాష్ (Aakash) వంటి జాతీయ విద్యాసంస్థలు పోటీపడి మరీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభాన్ని ఆసరాగా చేసుకుని విద్యా మాఫియా రూ. వేల కోట్లు దండుకునేందుకు పక్కాగా స్కెచ్ వేసి అమలు చేస్తోంది. ఈ మెరిసే ర్యాంకుల వెనుక ఉన్న చీకటి కోణాలు, విద్యా చట్టాల ఉల్లంఘనలు, ఫీజుల దోపిడీలు, విద్యార్థుల ఆత్మఘోషపై ‘ఈనాడు’ ప్రత్యేక క్షేత్రస్థాయి విశ్లేషణ.
అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టెన్త్, సీబీఎస్‌ఈ ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల దందా మొదలైంది. టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల జాబితాలను అక్రమ మార్గాల్లో సేకరిస్తున్న ఈ సంస్థలు, ప్రత్యేక టెలీకాలర్స్‌తో రాత్రింబవళ్లు ఫోన్లు చేయిస్తున్నాయి. తమ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు ఇప్పుడే ‘అడ్వాన్స్ బుకింగ్’ చేసుకోవాలంటూ తల్లిదండ్రులను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నాయి.
అనుమతి ఒకదానికి.. వ్యాపారం మరొకదానికి!
*సమగ్ర కోర్సుల (ఇంటిగ్రేటెడ్) పేరిట మోసం:
శ్రీ చైతన్య, నారాయణలతో పాటు ఉత్తరాది బ్రాండ్లు అలెన్, రెజోనెన్స్ వంటి సంస్థలు 'ఇంటిగ్రేటెడ్ ఐఐటీ/నీట్' బ్యాచ్‌ల పేరుతో చట్టవిరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నాయి.
*కళాశాలల గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లు: తెలంగాణలో వందలాది ప్రైవేట్ జూనియర్ కాలేజీలు బోర్డు నుంచి ఎలాంటి అనుబంధ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు పూర్తి చేస్తున్నాయి. వీటికి కనీస ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ (Fire Safety NOC) కూడా లేదు. కమర్షియల్ కాంప్లెక్స్‌లలో, ఇరుకు గదులలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ఈ క్యాంపస్‌లు నడుస్తున్నాయి.
*వేసవి నిబంధనల ఉల్లంఘన: మే నెల ఆఖరి దాకా వేసవి సెలవులు ఇవ్వాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఏప్రిల్ మొదటి వారం నుంచే సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభించి విద్యార్థులను భానుడి భగభగలకు గురిచేశారు.
*లొసుగుల 'ఈఎంఐ'లు – సమాంతర ఫైనాన్స్ మాఫియా
హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఇంటర్ కాలేజీలలో ఫీజులు రూ. 1,00,000 నుండి ప్రారంభమై రూ. 3.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యకు పటిష్టమైన ఫీజు నియంత్రణ కమిటీ (ఫ్రీ రెగ్యులరిటీ బాడీ) లేకపోవడాన్ని ఈ విద్యాసంస్థలు పెట్టుబడిగా మార్చుకున్నాయి.
*ఈ.ఎం.ఐ లొసుగుల సరికొత్త దోపిడీ:
ఇటీవలి కాలంలో విద్యాసంస్థలు సరికొత్త ఆర్థిక దోపిడీకి తెరలేపాయి. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలతో చేతులు కలిపి, తల్లిదండ్రులకు 'నో-కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్లు ఇస్తున్నట్లు నమ్మిస్తున్నారు. తీరా చూస్తే అవి భారీ వడ్డీలతో కూడిన పర్సనల్ లోన్లుగా మారుతున్నాయి. ఫీజులు సకాలంలో కట్టకపోతే విద్యార్థులను క్లాసుల నుండి బయటకు పంపడం, హాల్ టికెట్లు ఆపేస్తామని బెదిరించడం వంటి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు.
*క్లాసుల నిండా గొర్రెల మందలా విద్యార్థులు.. కోట్లల్లో సంపాదన!
సాధారణంగా క్లాసులో 40 నుండి 45 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. కానీ బోర్డు నిబంధనలను పక్కనబెట్టి ఒక్కో క్లాసులో 60 నుండి 80 మంది విద్యార్థులతో క్లాసులు నిర్వహిస్తున్నారు.
* ఒక్కో కాలేజీ ఐదు, ఆరు, ఏడు సెక్షన్లు ఏర్పాటు చేస్తూ ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ. లక్షకు తగ్గకుండా ఫీజు వసూలు చేస్తోంది.
* ఈ లెక్కన ఒక కాలేజీ ఏడు గ్రూపుల్లో మొత్తం కలిపితే 420 మంది విద్యార్థుల నుంచి సగటున ఏడాదికి ఫీజు రూపేణా రూ. 4.20 కోట్లు దండుకుంటోంది.
* గ్రేటర్ పరిధిలోనే దాదాపు 700 కాలేజీల ద్వారా ఈ విద్యా మాఫియా రూ. వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది.
ఉత్తరాది మాఫియా – కోట సంస్కృతి తెచ్చిన ముప్పు
రాజస్థాన్‌లోని 'కోటా' కేంద్రంగా పనిచేసే అలెన్, రెజోనెన్స్ వంటి సంస్థలు ఇప్పుడు హైదరాబాద్‌లో తిష్ట వేశాయి. అక్కడ విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే 'కోటా సంస్కృతి'ని ఇక్కడికి కూడా దిగుమతి చేశాయి. రోజుకు 12 నుండి 14 గంటల క్లాసులు, వీక్లీ టెస్టులు, మార్కుల ఆధారంగా సెక్షన్లు మార్చడం (స్టార్ బ్యాచ్, చైనా బ్యాచ్, నియాన్ బ్యాచ్) వంటి చర్యలు విద్యార్థులను తీవ్ర మానసిక కుంగుబాటుకు గురిచేస్తున్నాయి.
*ఆత్మహత్యల శరణాలయం: ఇంటర్ బోర్డు విచారణల్లో అత్యధిక శాతం విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కార్పొరేట్ సంస్థల రెసిడెన్షియల్ (హాస్టల్) క్యాంపస్‌లలోనే జరుగుతున్నట్లు తేలింది. వీరికి కనీస శారీరక శ్రమ, ఆటలు, వినోదం అనేవి ఉండవు.
లాసెట్ (LAWCET/CLAT) లోనూ దోపిడీ:* కేవలం సైన్స్ గ్రూపులే కాకుండా గ్యాన్‌విల్లే అకాడమీ, గాతిక్ జూనియర్ కాలేజ్, పేజ్, అభ్యాస్ వంటి సంస్థలు హ్యుమానిటీస్, లాసెట్ శిక్షణ పేరిట సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.
*ఇంటర్ బోర్డు నిస్సహాయత లేదా మిలాఖత్?
ప్రతి సంవత్సరం ఇంటర్ బోర్డు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేయడం, నోటీసులు జారీ చేయడం ఒక ప్రహసనంగా మారింది.
*డమ్మీ అడ్మిషన్ల నెట్‌వర్క్:
హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన బ్రాంచ్‌లలో వేల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ బోర్డు నిబంధనల ప్రకారం ఒక సెక్షన్‌కు 88 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. దీనికోసం వీరు జిల్లాల్లో ఉన్న తమ ఇతర అనుబంధ (గుర్తింపు ఉన్న) డమ్మీ కాలేజీల పేరుతో విద్యార్థులను పరీక్షలకు ఎన్‌రోల్ చేస్తారు. ఈ భారీ అక్రమం ఇంటర్ బోర్డు అధికారుల కళ్లముందే జరుగుతున్నా.. రాజకీయ, ఆర్థిక పలకుబడి కారణంగా అధికారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజులను నియంత్రించడానికి, ఈ విద్యా మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
