మద్యం మత్తులో స్టీరింగ్ పడితే 10 ఏళ్ల జైలు!
మల్కాజ్‌గిరిలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ఉధృతం.. వారం రోజుల్లో 268 మందిపై కేసులు!
మల్కాజ్‌గిరి:
మద్యం సేవించి వాహనాలు నడిపే బేఫికర్ బాబులపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీకెండ్ మత్తులో రోడ్లపైకి వస్తున్న వారిని ఏరిపారేసేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గత వారం రోజుల్లో (మే 24 నుండి మే 30 వరకు) నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా 268 మంది వాహన చోదకులు మద్యం తాగి అడ్డంగా దొరికిపోయారు. పట్టుబడిన వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
*ద్విచక్ర వాహనదారులే ఎక్కువ!
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో బైక్‌లు నడిపేవారే అత్యధికంగా ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వాహనాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
*ద్విచక్ర వాహనాలు:232,
*నాలుగు చక్రాల వాహనాలు (కార్లు): 29,
*మూడు చక్రాల వాహనాలు (ఆటోలు): 06,
*భారీ వాహనాలు:01,
*మొత్తం కేసులు: 268,
పట్టుబడిన వారి రక్తంలో ఆల్కహాల్ శాతాన్ని (బి.ఎ.సి) పరీక్షించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. కొందరైతే పరిమితికి మించి విపరీతంగా తాగి రోడ్లపైకి వచ్చినట్లు తేలింది.
* 36 మి.గ్రా నుంచి 200 మి.గ్రా లోపు ఆల్కహాల్ మోతాదు ఉన్నవారు: 250 మంది,
201 మి.గ్రా నుంచి 300 మి.గ్రా లోపు ఆల్కహాల్ మోతాదు ఉన్నవారు:12 మంది
* 300 మి.గ్రా కంటే ఎక్కువ ఆల్కహాల్ మోతాదు ఉన్న ప్రమాదకర చోదకులు:06 మంది.
*ప్రమాదం జరిగితే ‘హత్య కాని నేరపూరిత నరహత్య’ కింద కేసు!
*కోర్టుకు నిందితులు.. గత వారం 142 మందికి జరిమానా
తాజాగా పట్టుబడిన 268 మంది నిందితులను త్వరలోనే న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, గత వారం రోజుల్లో కోర్టులో 142 మద్యం తాగి నడిపిన కేసులు విచారణకు రాగా, ఆ 142 మంది నిందితులకు న్యాయస్థానం జరిమానా విధించిందని ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి డ్రైవింగ్ సంస్కృతిపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.
