త్యాగాల పునాదులు మావి.. అబద్దాల చరిత్ర మీది..
- నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారు..
- ఆరు గ్యారెంటీ ల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు..
- సిఎస్ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు పెట్టకపోతే ప్రజా ఉద్యమం..
- రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో పటాన్‌చెరులో బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేస్తాము..
- రాబోయే బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలు..
- 9 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేస్తాము..
- ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం..
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే..
- పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..
- కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఫైర్..
- ప్రజా పాలన గాలికి పర్సంటేజిల పాలన చేతికి..
- డిజిటల్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి..
- ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్..
- పటాన్‌చెరులో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం..
- గులాబీమయమైన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్..
పటాన్‌చెరు:
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల పునాదులపై పాలన కొనసాగిస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి..సంక్షేమంలో దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దితే నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇండ్ల కూల్చివేతలు.. రైతుల రోదనలు.. నిరుద్యోగుల ఆక్రందనలు.. హామీల ఎగవేతలతో పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగ వాతావరణం లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పటాన్‌చెరు నియోజకవర్గంలో గులాబీ జెండాను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలం పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి.. సంక్షేమంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ గర్వపడేలా పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు సమన్వయకర్తలుగా పనిచేశారని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారిని తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. మూడుసార్లు పటాన్‌చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయడంతో పాటు ప్రతి ఎన్నికల్లోను గులాబీ జెండా ను రెపరెపలాడించడామని అన్నారు. ప్రతి గెలుపులో కార్యకర్తల కష్టం మరువలేనిదని అన్నారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి నిర్వహించుకునే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగ వాతావరణం లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.
త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల జరిగిన ఐదు మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ చేసిన విధంగానే.. 9 డివిజన్లలోనూ బిఆర్ఎస్ అభ్యర్థులే ఘన విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఇండ్ల కూల్చివేతలు.. రైతుల రోదనలు.. నిరుద్యోగుల ఆక్రందనలు..ఇదా మీ ఇందిరమ్మ పాలన..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పటాన్‌చెరు నియోజకవర్గంలోని నిరుపేదలకు కాలరాత్రులు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదోడి గుడిసెల పైకి బుల్డోజర్ ను పంపిస్తూ వారి జీవితాలను ఆగమాగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చి నేడు వాటిని అమలు చేయకుండా అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేవలం రెండు సంవత్సరాల పాలనలోనే ప్రజలు విసిగిపోయారని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. ఇందిరమ్మ పాలన పేరుతో ప్రజలను అష్ట కష్టాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమల ద్వారా అందిస్తున్న సి ఎస్ ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలని.. లేనిపక్షంలో వేలాది మందితో కలిసి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులోనూ స్థానికులకు 10 శాతం కోట ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గం అంటేనే బిఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని.. ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో పటాన్‌చెరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అతి త్వరలో మరోసారి డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయి నుండి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు.
