దేశానికే రోల్ మోడల్ 'ఇందిరమ్మ ఇళ్లు'
- *స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం: మంత్రి పొంగులేటి
- *13 నెలల్లోనే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి.. మరో రెండు నెలల్లో 2 లక్షల ఇళ్లు సిద్ధం
- *నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడతకు శ్రీకారం.
- *కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు.. ఈ ఏడాది 3.50 లక్షల ఇళ్ల మంజూరు.
హైదరాబాద్:
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఉచితంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒక సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ముఖ్యమంత్రి ఆలోచనలు, సూచనల మేరకు మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.
*నేడే రెండో విడత ప్రారంభం
జూన్ 1వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే కొత్తగూడలో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో కలుపుకొని, రెండు విడతల్లో కలిపి ప్రతి నియోజకవర్గానికి 5,500 నుంచి 6,500 ఇళ్లను కేటాయించినట్లు అవుతుందని వివరించారు. ఐటీడీఏ (ITDA) పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా మరో 500 నుంచి 1,500 ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
గత ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారని.. కేవలం ఈ 13 నెలల కాలంలోనే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని మంత్రి వెల్లడించారు. మరో ఒకటి రెండు నెలల్లో ఇంకో 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయని, గృహ నిర్మాణ రంగంలో ఇదొక జాతీయ రికార్డు అని కొనియాడారు.
*ఈ ఏడాది 3.50 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతులు
ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పేదల (క్యూర్) పరిధిలో ఒక లక్ష ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లకు.. మొత్తంగా 3.50 లక్షల ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, మరింత పటిష్టమైన ప్రణాళికతో రెండో విడత కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలను సాగదీస్తున్నాయని మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 'పేదవాడి ఇల్లు - ప్రభుత్వ బాధ్యత' అనే లక్ష్యంతో స్వంత నిధులతో ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి లబ్ధిదారునికి ఏకంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.
*అసంపూర్తి ఇళ్లకు కాంగ్రెస్ సర్కార్ ఆసరా
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 2013 వరకు అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను, అలాగే 2023లో 'గృహలక్ష్మి' పథకంలో ఇళ్లు మంజూరై మధ్యలోనే నిలిచిపోయిన వాటిని పూర్తి చేయడానికి ఈ రెండో విడతలో అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం ద్వారా కేవలం రూ.20 వేల వరకు మాత్రమే ఆర్థిక సహాయం పొంది, ఇళ్లు పూర్తి చేసుకోలేని వారికి కూడా ఈ విడతలో ఇళ్లను మంజూరు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
