నిబంధనలు 'అటకెక్కించారు'.. అక్రమ కట్టడాలకు 'అక్యుపెన్సీ' కట్టబెట్టారు!
- ఎల్బీనగర్ జోన్‌లో పట్టణ ప్రణాళికా విభాగం లీలలు
- పారదర్శకత లోపం బిల్డ్ నౌ: అవినీతి అక్రమాల ప్రోత్సాహం..
- కనీస సెట్‌బ్యాక్‌లు లేవు.. జీఓ 168 నిబంధనలు గాల్లోకి!
- సర్టిఫికేట్ రాగానే రోడ్డును ఆక్రమించి రెండు షట్టర్ల నిర్మాణం,
- పూర్తి ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదు చేస్తే భారీ ముడుపులు తీసుకుని అక్రమార్కులకే సపోర్ట్..!
- ఫిర్యాదు అంది ఏడాది గడిచినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం
- బాధ్యులపై విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండ్..
- ఎం.ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మాత్యులు సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..!
ఎల్బీనగర్:
బిల్డ్ నౌ పోర్టల్ పుణ్యమా అంటూ పారదర్శకత లోపం అక్రమాలకు ప్రోత్సాహం, మాకు అడ్డు అదుపు లేదన్నట్లుగా అధికారుల అవినీతి చేష్టలు,
నగరంలో మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళికా చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయో చెప్పడానికి ఎల్బీనగర్ జోన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటనే ఒక నిదర్శనం. నిబంధనల ప్రకారం వదలాల్సిన కనీస ఖాళీ స్థలాన్ని (సెట్‌బ్యాక్‌లు) పూర్తిగా వదిలేసి, మంజూరైన ప్లాన్‌ను పూర్తిగా ఉల్లంఘిస్తూ నిర్మించిన ఒక భారీ అపార్ట్మెంట్ భవనానికి మున్సిపల్ అధికారులు దర్జాగా 'అక్యుపెన్సీ సర్టిఫికేట్' (OC) కట్టబెట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో అక్రమాలు కంటికి కనిపిస్తున్నా, వాటిని సరిచేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి సర్టిఫికేట్ జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*ప్లాన్ ఒకచోట.. నిర్మాణం మరోచోట!
రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని డాక్టర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 1 లో ఉన్న ఒక నివాస/వాణిజ్య భవన నిర్మాణంలో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. సర్వే నెంబర్ 9/1 (పాత), 9/6 (కొత్త) పరిధిలోని ప్లాట్ నెంబర్ 10 (దక్షిణ భాగం) మరియు ప్లాట్ నెంబర్ 11 లలో ఈ భవన నిర్మాణానికి గతంలో అనుమతులు లభించాయి. సదరు నిర్మాణదారులు 20-12-2023 తేదీన 4867/GHMC/LBN/3023-BP (ఫైల్ నెంబర్: 011172/GHMC/5496/LBN2/2023-BP) నెంబరుతో బిల్డింగ్ పర్మిట్ పొందారు.
అయితే, అనుమతి పత్రంలో చూపిన నిబంధనలను, క్షేత్రస్థాయి కట్టడాన్ని పరిశీలిస్తే ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. భవనానికి చుట్టూ వదలాల్సిన కనీస సెట్‌బ్యాక్‌లను పూర్తిగా బేఖాతరు చేస్తూ, రోడ్డును ఆనుకుని భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం. 168 (MA), తేదీ: 07-04-2012 ప్రకారం.. నగరంలో నిర్మించే ప్రతి భవనానికి ప్రజా భద్రత, గాలి, వెలుతురు మరియు అత్యవసర సమయాల్లో (అగ్నిప్రమాదాలు వంటివి) రక్షణ చర్యల నిమిత్తం నిర్దేశిత చుట్టుకొలతల్లో ఖాళీ స్థలాన్ని వదలడం తప్పనిసరి. కానీ, ఈ భవన నిర్మాణంలో ఆ నిబంధనలన్నింటినీ తిлоదకాలిచ్చారు.
ఇంతటి ఘోరమైన ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు మాత్రం కళ్లు మూసుకున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన (Physical Inspection) జరిపి, ప్లాన్ ప్రకారం ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ఇవ్వాల్సిన అక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారు. 23-10-2025 తేదీన 007268/GHMC/03434/SWOC/LBN2/2025 నెంబరుతో ఈ భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ కావడం, అధికారుల విధి నిర్వహణలోని అలసత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తోంది.
*సర్టిఫికేట్ రాగానే మరింత బరితెగింపు!
*అదనపు బాధ్యతల సాకు.. కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యం!
సరూర్‌నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాల వెనుక అధికారుల పర్యవేక్షణా లోపం ప్రధాన కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి ఎ.సి.పి మధు ప్రస్తుతం మూడు చోట్ల (నాగోల్ సర్కిల్, పెద్ద అంబర్‌పేట్ మరియు ఇతర ప్రాంతాల్లో) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఆయన సరూర్‌నగర్ సర్కిల్‌లో వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.
పనిభారం ఎక్కువ కావడంతో, సర్కిల్ పూర్తి బాధ్యతలను కిందిస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారిణి (టి.పి.ఎస్) అర్చనకు అప్పగించారు. అయితే ఆమె కూడా ఎల్బీనగర్, సరూర్‌నగర్ రెండు చోట్లా విధులు నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ ఓసి జారీ, రోడ్డుపై వెలిసిన అక్రమ షట్టర్ల వ్యవహారాన్ని సర్కిల్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న టి.పి.ఎస్ అర్చన దృష్టికి బాధితులు, స్థానికులు దాదాపు 10 సార్లకు పైగా లిఖితపూర్వకంగా, మౌఖికంగా తీసుకెళ్లారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి చర్యలు తీసుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై పదే పదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వెనుక అంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
*ఏడాది గడిచినా కదలని ఫైల్.. ఉన్నతాధికారుల స్పందన ఏది?
ఈ చట్టవిరుద్ధ అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ వ్యవహారంపై మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్ సరూర్‌నగర్ సర్కిల్-12 అధికారులకు గతేడాది "మే 5, 2025"నే మొదటిసారి వ్రాతపూర్వక ఫిర్యాదు అందింది. ఆ తర్వాత కూడా 19-12-2025 తేదీన ఉన్నతాధికారులతో పాటు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం మరియు సర్కిల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో రసీదు గుర్తింపుతో ఫిర్యాదు ప్రతులను సమర్పించారు. బాధ్యులు ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నా మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
*స్థానిక ప్రజల ప్రధాన డిమాండ్లు:
* ఓసి తక్షణ రద్దు: నిబంధనలను బేఖాతరు చేస్తూ, చట్టవిరుద్ధంగా జారీ చేసిన సదరు అక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను (OC) వెంటనే రద్దు చేయాలి.
*ఆక్రమణల తొలగింపు:
మున్సిపల్, ఫైర్ సేఫ్టీ రూల్స్‌కు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి వేసిన రెండు షట్టర్లను తక్షణమే కూల్చివేయాలి.
*విజిలెన్స్ విచారణ:
క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీకి సహకరించి, ఏడాది కాలంగా ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిని టి.పి.ఎస్ అర్చన విధి నిర్వహణపై ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి.
నగరంలో ఒకవైపు అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న ఉన్నతాధికారులు.. కళ్ల ముందే జరుగుతున్న ఇలాంటి మున్సిపల్ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోన్ ఎస్.టి.ఎఫ్ విభాగం ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి, విచారణ జరిపించాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది..jpeg)
