టెన్షన్ ఖతం.. 'ఎంసెట్' ఫలితాలు విడుదల!
- * ఇంజనీరింగ్‌లో మెడ్చల్ అమ్మాయి.. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో హైదరాబాద్ అబ్బాయి టాప్
- * పడిపోయిన ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.. అగ్రికల్చర్‌లో పెరిగిన పోటీ
- * వారం రోజుల్లోనే ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్.. జూన్ నుంచి ప్రక్రియ షురూ!
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TG EAPCET) - 2026 ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రాంగణంలో విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులు సంయుక్తంగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది సాంకేతిక (ఇంజనీరింగ్) విభాగంలో మెడ్చల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలవగా, వ్యవసాయ, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
మెడ్చల్, హైదరాబాద్ విద్యార్థుల హవా.. ర్యాంకర్ల వివరాలు ఇవే!
ఈసారి ఫలితాల్లో విద్యార్థులు భారీ మార్కులతో సత్తా చాటారు. మొదటి మూడు ర్యాంకులు సాధించిన వివరాలు కింది చూడొచ్చు:
*ఇంజనీరింగ్
1.ఎం. రుషి,మెడ్చల్ 156.63,
2.బెజుగమ అన్షుల్ మెడ్చల్148.70 ,
3.మరక వంశీధర్ రెడ్డి కడప (ఆంధ్రప్రదేశ్) 147.05,
*వ్యవసాయం & ఫార్మసీ
1.ముకర్రమ్ అహ్మద్ హైదరాబాద్150.17,
2.తాడూరి నివృత్ సాయి వెంకట్ హైదరాబాద్,
3.సాహితి గీతిక గునితి | రంగారెడ్డి ,
ఇంజనీరింగ్ పాస్ శాతం డౌన్!
ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది.
ఇంజనీరింగ్ విభాగం:
పరీక్ష రాసిన 1,97,242 మందిలో 73.36 శాతం (1,44,704 మంది) విద్యార్థులు అర్హత సాధించారు.
ప్రవేశాల ర్యాంకుల కేటాయింపులో ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం ప్రాధాన్యత (వెయిటేజీ) ఇచ్చి తుది అర్హత జాబితాను సిద్ధం చేశారు. సాధారణ, వెనుకబడిన తరగతుల (ఓబీసీ) అభ్యర్థులు అర్హత సాధించాలంటే కనీసం 25 శాతం (160 మార్కులకు గానూ 40 మార్కులు) సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.
కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం.. సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి!
ఫలితాల విడుదల సందర్భంగా ఉన్నత విద్యామండలి అధికారులు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి సంబంధించిన
*వెబ్ కౌన్సెలింగ్ కాలపట్టికను (షెడ్యూల్) వారం రోజుల్లోగా ప్రకటిస్తామని వెల్లడించారు. జూన్ మొదటి వారం నుంచే సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక అంతర్జాల వేదిక (వెబ్‌సైట్) eapcet.tgche.ac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబోయే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కుల పత్రం, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
