అనుమతి ఒకటికి.. నిర్మాణం మరొకటికి!

  • మలక్‌పేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనం
  • అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణం.. అక్రమ నిర్మాణం కూల్చకుంటే ఆత్మహత్యే శరణ్యం బాధితుడి డిమాండ్.

అనుమతి ఒకటికి.. నిర్మాణం మరొకటికి!

హైదరాబాద్

నగరంలో అక్రమ కట్టడాల పర్వం కొనసాగుతూనే ఉంది. అనుమతులు ఒక రకంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో మరో రకంగా నిర్మాణాలు చేపడుతున్న ఘటన తాజాగా మలక్‌పేట్ పరిధిలోని అక్బర్‌బాగ్‌లో వెలుగుచూసింది. అధికార యంత్రాంగం నోటీసులు ఇచ్చినా, భవనాన్ని సీజ్ చేసినా లెక్కచేయకుండా నిర్మాణాలు సాగిస్తుండటం గమనార్హం.
​వివరాల్లోకి వెళ్తే..
మలక్‌పేట్ సర్కిల్-27 పరిధిలోని అక్బర్‌బాగ్‌లో ఉన్న ఓ ఓపెన్ ప్లాట్ (H.No.16-2-716/D) విషయంలో వివాదం నెలకొంది. సదరు స్థలంలో భవన యజమానులు కేవలం స్టిల్ట్ ప్లస్ రెండు అంతస్తుల (G+2) నివాస కట్టడానికే జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా ఐదు అంతస్తుల (G+4) భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్‌ల విషయంలోనూ నిబంధనలు పాటించకుండా గాలికి వదిలేశారు.

​నకిలీ పత్రాలతోనే అనుమతి?
ఈ అక్రమ నిర్మాణంపై పక్కనే నివసించే మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తులు నకిలీ పత్రాలు, తప్పుడు డోర్ నంబర్లను చూపి అనుమతి పొందినట్లు ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై గతేడాది జూన్ నుంచి పోరాడుతున్నా, అధికారులు కేవలం నోటీసులకే పరిమితమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించినట్లు నిర్ధారించి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

​చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం..
అధికారులు ఎన్ని నోటీసులు ఇచ్చినా నిర్మాణదారులు పనులు ఆపడం లేదని బాధితుడు ఖుద్దూస్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో గుండె శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన స్థితిలో ఉన్నానని, అధికారుల నిర్లక్ష్యం తనను మరింత కుంగదీస్తోందని ఆయన వాపోయారు. తక్షణమే ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేసి తనకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆయన ఉన్నతాధికారులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

​హెచ్చరించిన అధికారులు..
ఈ వ్యవహారంపై స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులను 15 రోజుల్లోగా స్వచ్ఛందంగా తొలగించాలని యజమానులను ఆదేశించారు. లేనిపక్షంలో నగరపాలక సంస్థే స్వయంగా కూల్చివేత చేపట్టి, ఆ ఖర్చును కూడా యజమానుల నుంచే వసూలు చేస్తామని స్పష్టం చేశారు.

About The Author