నాచారం చెరువుకు మోక్షం!

  • ​గుర్రపుడెక్క తొలగించి, పూడిక తీయాలని హైడ్రా ఆదేశం.
  • ​మీర్జాల్‌గూడలో ముంపు తిప్పలపై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

నాచారం చెరువుకు మోక్షం!

​హైదరాబాద్:

నగరం చుట్టూ ఉన్న చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు హైడ్రా నడుం బిగించింది. రెండో విడతలో భాగంగా చేపట్టిన 14 చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వేగవంతం చేశారు. మంగళవారం ఉప్పల్ మండలంలోని నాచారం 'పెద్ద చెరువు'ను ఆయన స్వయంగా పరిశీలించారు. 108 ఎకరాల విస్తీర్ణమున్న ఈ చెరువులో ఏకంగా 81 ఎకరాల మేర గుర్రపుడెక్క పేరుకుపోయి, అసలు నీటి జాడ కూడా కనిపించకుండా పోవడాన్ని గుర్తించారు.

​దోమల బెడద.. మురుగు నీటి గోస
చెరువు పరిస్థితిపై స్థానికులు కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు. "మురుగు నీరు నేరుగా చెరువులో కలవడంతో గుర్రపుడెక్క పెరిగిపోయి దోమలతో చస్తున్నాం.. గతంలో పెట్టిన ఎస్టీపీ (STP) వల్ల పైసా ఉపయోగం లేదు" అని ఫిర్యాదు చేశారు. అంబర్‌పేట బతుకమ్మ కుంట, కూకట్‌పల్లి నల్లచెరువు తరహాలో తమ చెరువును కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. స్పందించిన కమిషనర్.. వెంటనే చెరువులోని మురుగు నీటిని వదిలేసి, పూడికను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్ నల్లచెరువు పనులకు ఆటంకం కలగకుండా కాలువను డైవర్ట్ చేయాలని సూచించారు.

​నాలాలు కుంచించుకుపోయి.. కాలనీలు మునుగుతున్నాయి!

​మీర్జాల్‌గూడలో వరద ముప్పుపై హైడ్రా అధ్యయనం
​మల్కాజిగిరి పరిధిలోని మీర్జాల్‌గూడ, చిన్మయి మార్గ్ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలంలో తలెత్తుతున్న వరద సమస్యపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి రంగనాథ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

​క్షేత్రస్థాయిలో తేలిన చేదు నిజాలు:
​కుంచించుకుపోయిన నాలాలు: మహేంద్ర హిల్స్ నుంచి భారీగా వచ్చే వరద నీరు వెళ్లేందుకు కేవలం ఒక మీటరు వెడల్పున్న నాలా మాత్రమే ఉండటంతో కాలనీలు జలమయమవుతున్నాయి.
​ఆక్రమణల సెగ: వరద నీరు సాఫీగా వెళ్లే దారి లేక నీరంతా ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

​పరిష్కార మార్గాలు: ఉన్న అండర్ డ్రైనేజీ కాలువను వెడల్పు చేయాలా? లేక సమాంతరంగా కొత్త కాలువ నిర్మించాలా? అనే అంశంపై కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాలువ విస్తరణకు స్థానికులు సహకరించాలని కోరారు.

About The Author