మందుబాబుల గుండెల్లో రైళ్లు.. మల్కాజిగిరి పోలీసుల 'స్పెషల్' డ్రైవ్!
- వీకెండ్ మత్తు వదిలించిన ట్రాఫిక్ పోలీసులు
- డ్రింక్ అండ్ డ్రైవ్' వేటలో 214 మంది ఖైదీ
- రోడ్లపై యమపాశంలా తిరిగితే.. పదేళ్ల జైలు శిక్షే!
మల్కాజిగిరి
వీకెండ్ ఎంజాయ్‌మెంట్ పేరుతో రోడ్లపై చిందులేసే మందుబాబుల ఆటకట్టించారు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు. సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే తాగుబోతు వాహనదారులపై ఉక్కుపాదం మోపారు. రాత్రి సమయాల్లో గల్లీ గల్లీలో నిఘా పెట్టి, బాధ్యతారహితంగా వాహనాలు నడుపుతున్న 214 మంది మందుబాబులను పట్టుకుని, వారి మత్తు వదిలించారు. నిరంతరం నిఘా ఉంచుతూ రోడ్డు ప్రమాదాలను అరికడుతున్న పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల పకడ్బందీ వ్యూహం.. ఫలితం ఇదీ!
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు వేసిన పక్కా ప్లాన్‌తో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:
టూ వీలర్లు (బైక్ రైడర్స్): 187 మంది
కార్లు (ఫోర్ వీలర్లు): 21 మంది
ఆటోలు: 5 మంది
భారీ వాహనాలు: 1
పట్టుబడిన వారిలో 10 మంది వాహనదారులు ఏకంగా 301 mg నుంచి 550 mg వరకు BAC (రక్తంలో ఆల్కహాల్ శాతం) కలిగి ఉండటం గమనార్హం. ఇంత భారీ స్థాయిలో మద్యం సేవించి వాహనం నడపడం అంటే మృత్యువుతో చెలగాటమాడటమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరందరినీ కోర్టులో హాజరుపరిచి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
కొత్త చట్టం.. పదేళ్ల జైలు శిక్ష!
"తాగి బండి నడిపి ప్రాణాలు తీస్తే ఊరుకోం" అంటూ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 105 ప్రకారం.. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైతే అది 'హత్య కాని నేరపూరిత మానవహత్య' కిందకు వస్తుందని తెలిపారు. దీనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని డీసీపీ స్పష్టం చేశారు.
గత వారం (మార్చి 15-21) కాలంలో పట్టుబడిన 128 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తులు వారికి చురకలు అంటించారు. 120 మందికి భారీ జరిమానాలు విధించగా, మరో 8 మందికి జరిమానాతో పాటు 'సామాజిక సేవ' చేయాలని శిక్ష విధించారు. పోలీసుల ఈ కఠిన చర్యలు రోడ్డు భద్రతపై సామాన్యుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.
- డి.సి.పి, మల్కాజిగిరి కమిషనరేట్.
.jpeg)
