దొంగ దొరికినా.. చర్యలు ఎక్కడ?
- మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమ అసెస్‌మెంట్ పర్వం.. చూసీచూడనట్లు వదిలేస్తున్న ఉన్నతాధికారులు!
- ఒక సర్కిల్ ఫైలు మరో సర్కిల్‌లో క్లియరెన్స్.. జోనల్ కమిషనర్ మౌనం వెనుక మర్మమేంటి?
- సరూర్నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ అవినీతి తేటతెల్లమైనా, తప్పుడు నివేదికలతో జోనల్ కమిషనర్ను బురిడీ కొట్టిస్తున్న వైనం..!
హైదరాబాద్, :
అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. ఆధారాలతో సహా తప్పులు బయటపడి నెలలు గడుస్తున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని అక్రమ అసెస్‌మెంట్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
హద్దులు దాటి.. అసెస్‌మెంట్లు చేసి!
హయాత్ నగర్ సర్కిల్ పరిధిలోకి వచ్చే ప్రాపర్టీలకు సరూర్ నగర్ (సర్కిల్ 12) అధికారులు అసెస్‌మెంట్ చేయడం వెనుక పెద్ద నెట్‌వర్కే నడిచినట్లు తెలుస్తోంది. కోర్టు వివాదంలో ఉన్న ఇంటికి (నెంబర్: 3-8-439/1, మన్సూరాబాద్ డివిజన్) నిబంధనలకు విరుద్ధంగా పిటిఎన్ నెంబర్ (1050315474) కేటాయించి క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక లక్షల రూపాయల చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీనివాస్ ‘లాగిన్’ మాయాజాలం..
సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ భోనగిరి శ్రీనివాస్, ఏఎంసి శ్రీనివాసరావుల లాగిన్ల ద్వారానే ఈ అక్రమ ప్రక్రియ పూర్తయినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. గతేడాది జరిగిన ఈ తతంగంపై ప్రశ్నిస్తే.. ‘పొరపాటు జరిగింది’, ‘కింది స్థాయి అధికారులు ఫైలు పంపారు కాబట్టి సంతకం చేశాం’ అంటూ నీళ్లు నములుతున్నారు. తప్పు జరిగిందని స్వయంగా అధికారులే ఒప్పుకున్నా, సదరు ఫైళ్లను బ్లాక్ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, ఈ అక్రమానికి అసలు సూత్రధారులు ఎవరనేది మాత్రం బయటపెట్టడం లేదు.
జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ దృష్టికి ఈ అక్రమ అసెస్‌మెంట్ల వ్యవహారం వెళ్లినా, ఇప్పటి వరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆధారాలతో సహా ఫిర్యాదులు అందుతున్నా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఇంటి దొంగల’ను కాపాడటంలో ఉన్నతాధికారులపై ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా? లేక శాఖాపరమైన లోపాలే కారణమా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లోను ఇదే పరిస్థితి!
కేవలం ఎల్బీనగర్ జోన్ మాత్రమే కాదు.. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ఇలాంటి అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హయాంలో జరుగుతున్న కార్యకలాపాలపై కూడా ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడం, రెవెన్యూ విభాగంలో అవకతవకలు జరుగుతున్నా కఠినంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
గడ్డిఅన్నారం, దిల్ సుఖ్ నగర్ వంటి భారీ కమర్షియల్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, కమర్షియల్ టాక్స్‌ను తక్కువ చేసి చూపిస్తూ జీహెచ్‌ఎంసీ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి కొడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఈ అక్రమ నెట్‌వర్క్ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.
.jpeg)
