నీటి యుద్ధాలు రాకముందే మేల్కొందాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్:
ప్రస్తుతం చమురు కోసం జరుగుతున్న యుద్ధాలు, భవిష్యత్తులో నీటి కోసం వచ్చే ప్రమాదం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. జలవనరుల పరిరక్షణలో అలసత్వం వహిస్తే మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, నీటి యుద్ధాలకు తావులేకుండా ఇప్పటి నుంచే పటిష్ట చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం జేఎన్‌టీయూలో ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్ - హైదరాబాద్ చాప్టర్, ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియం సంయుక్తంగా నిర్వహించిన ‘వరల్డ్ వాటర్ డే’ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అంచనాలకు మించి జనాభా.. పెరుగుతున్న సవాళ్లు
పునరుద్ధరణ దశలు: మొదటి దశలో ఆరు చెరువులను ఎంపిక చేయగా, మూడు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతా మూడు సిద్ధంగా ఉన్నాయి. రెండో దశలో మరో 18 చెరువులను అభివృద్ధి చేయనున్నారు.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) గణాంకాలను ప్రస్తావిస్తూ, 1975 నుంచి 2023 మధ్య కాలంలో నగరంలో 61 శాతం చెరువులు మాయమయ్యాయని రంగనాథ్ వెల్లడించారు. నగరంలోని 1300 చెరువుల్లో దాదాపు 700 కనుమరుగయ్యాయని, మిగిలిన వాటిలో 60 శాతం ఆక్రమణల పాలయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఆక్రమణల తొలగింపు కేవలం కాగితాలకే పరిమితమైందని, ఇప్పుడు హైడ్రా ఆ విమర్శలకు చరమగీతం పాడుతూ క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
"మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు 14 ఎకరాలకు కుంచించుకుపోయింది. హైడ్రా చొరవతో ఆక్రమణలు తొలగించి దానిని 29 ఎకరాలకు విస్తరించాం. తొలినాళ్లలో విమర్శించిన వారే, ఇప్పుడు అక్కడ పిక్నిక్ స్పాట్‌లా మారిన వాతావరణాన్ని చూసి అభినందిస్తున్నారు." అని కమిషనర్ వివరించారు.
రియల్ ఎస్టేట్‌లో మార్పు.. పర్యావరణమే లక్ష్యం
హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో, రియల్టర్లలో స్పష్టమైన మార్పు వచ్చిందని కమిషనర్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల పరిధిలో ఇళ్లు నిర్మించడానికి రియల్టర్లు భయపడుతున్నారని, ప్రజలు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని చెప్పారు. ఇది పర్యావరణ పరిరక్షణకు శుభపరిణామమని పేర్కొన్నారు.
సాధించిన ఫలితాలు:
బడా బాబుల ఆక్రమణల నుంచి 1350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.
ప్యాట్నీ నాలా ఆక్రమణల తొలగింపుతో 27 కాలనీలకు వరద ముప్పు తప్పింది.
అమీర్‌పేట వంటి లోతట్టు ప్రాంతాల్లో నాలాల పూడికతీత వల్ల నీరు నిలిచే సమస్య పరిష్కారమైంది.
ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొ. కిషన్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొ. నరసింహారెడ్డి, డైరెక్టర్ డా. మృత్యుంజయ రెడ్డి తదితరులు పాల్గొని, జలవనరుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు.
