31న నగరంలో మాంసం విక్రయశాలల బంద్ మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆదేశాలు
హైదరాబాద్:
మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అన్ని మాంసం విక్రయశాలలు, కబేళాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533 (బి) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అమలులోకి రానున్న నిబంధనలు:
ఈ నెల 31న (31-03-2026) నగరం అంతటా పశువులు, గొర్రెలు, మేకల కబేళాలు పూర్తిగా మూతపడనున్నాయి.
రిటైల్ మాంసం దుకాణాలతో పాటు బీఫ్ విక్రయశాలలను కూడా మూసి ఉంచాలని స్పష్టం చేశారు.
గతేడాది సెప్టెంబర్ 24న జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం (నెం. 26) మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలీసుల సహకారం:
ఈ నిబంధనలు కఠినంగా అమలు అయ్యేలా చూడాలని, మున్సిపల్ సిబ్బందికి తగిన సహకారం అందించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను జీహెచ్‌ఎంసీ కోరింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
