నమిశ్రీ 'ఆరియా'లో అక్రమాల కోట!
- నాగోల్ బండ్లగూడ లో వేలకోట్ల అవినీతి రియల్ ఎస్టేట్ దందా:
- ఫోర్జరీ పత్రాలతో రూ. 100 కోట్ల ఫైనాన్స్.. అటవీ భూమి కబ్జా!రేరా నిబంధనలకు తిలోదకాలు ..
- ఫోర్జరీ నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ :కోట్లల్లో లంచాలు తీసుకొని హెచ్ఎండిఏ అనుమతులు..
- మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చర్యలు ఎక్కడ...!
- అధికారుల 'ముడుపుల' మత్తు.. ఎఫ్ఐఆర్ ఉన్నా ఆగని నిర్మాణాలు.. సామాన్యుడి సొమ్ముకు భద్రత ఏది?
- రేవంత్ సర్కార్ పైనే ఆశలు: స్పెషల్ అధికారి జయేశ్ రంజన్ , హైడ్రా రంగనాథ్ దృష్టి సారించి ఈ అక్రమ కోటను కూల్చేది ఎప్పుడు...!
ఫోర్జరీ పత్రాలతో పునాదులు వేసి, ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేస్తూ వెలుస్తున్న 'నమిశ్రీ అరియా' ప్రాజెక్టు ఒక అవినీతి కుంభకోణం. వందల కోట్ల బ్యాంకు రుణాలు పొందేందుకు నకిలీ ధృవపత్రాలను సృష్టించి, చట్టాన్ని చుట్టచుట్టేసిన బడా రియల్టర్ల దందా ఇది. ఎఫ్ఐఆర్ నమోదైనా, అధికారుల అండదండలతో నిర్మాణాలు సాగుతుండటం వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట.
హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల 'ముడుపుల' మత్తులో సామాన్యుడి కష్టార్జితం బలిపీఠం ఎక్కుతోంది. హైడ్రా (HYDRAA) మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అక్రమ కోటను కూల్చకపోతే, నమ్మి కొనే మధ్యతరగతి ప్రజలు నట్టేట మునగడం ఖాయం. ఇది కేవలం భవనం కాదు, పేదల నమ్మకంపై నిర్మించిన అక్రమ సామ్రాజ్యం.
హైదరాబాద్:
నిబంధనలంటే సామాన్యుడికి గుదిబండలు.. బడా రియల్టర్లకు మాత్రం రబ్బరు బ్యాండ్లు! రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలో వెలుస్తున్న “నమిశ్రీ ఆరియా” (Namishree ARIA) ప్రాజెక్టు ఇప్పుడు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఫోర్జరీ పత్రాలతో బ్యాంకుల కళ్లు గప్పి రూ. 100 కోట్ల రుణం పొందడం ఒకెత్తయితే, ఏకంగా అటవీ భూములను, ప్రభుత్వ ఆస్తులను మింగేస్తూ కాంక్రీటు కోటలు కడుతుండటం కలకలం రేపుతోంది. పోలీసు కేసులు, అధికారుల విచారణలు ఉన్నా.. 'తగ్గేదే లే' అన్నట్లుగా సాగుతున్న ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..jpeg)
సర్వే నంబర్ 121/P లో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పునాదులే అక్రమాలతో పడ్డాయి. వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసే NALA సర్టిఫికేట్ దగ్గర నుండి భూమి పత్రాల వరకు అన్నీ ఫోర్జరీవేనని ఆరోపణలు ఉన్నాయి. విస్తుపోయే విషయం ఏంటంటే.. పక్కాగా తనిఖీలు చేయాల్సిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి సంస్థలు, ఈ నకిలీ పత్రాలను చూసి ఏకంగా రూ. 100 కోట్ల నిర్మాణ రుణాన్ని ఎలా మంజూరు చేశాయి? ప్రజల సొమ్మును అప్పనంగా కట్టబెట్టే ముందు బ్యాంకులు జరిపే 'డ్యూ డిలిజెన్స్' ముడుపుల ముందు మోకరిల్లిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు ఒకచోట.. నిర్మాణాలు మరోచోట!
నమిశ్రీ సంస్థ అరియా ప్రాజెక్టు కోసం సర్వే నంబర్ 121లో (సుమారు 2 ఎకరాల 35 గుంటలు) అనుమతులు పొందింది. కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్!
అటవీ భూమి కబ్జా: పక్కనే ఉన్న సర్వే నంబర్ 117/6 లోని 4 ఎకరాల అటవీ భూమిని యథేచ్ఛగా ఆక్రమించారు.
ప్రభుత్వ భూమి స్వాహా: సర్వే నంబర్ 122లోని మరో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రాజెక్టులో కలిపేశారు.
ఏడీ శ్రీనివాసులు ఇచ్చిన రెవెన్యూ స్కెచ్‌లో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఫారెస్ట్ ఆఫీసర్లు గాఢనిద్రలో ఉండటం వెనుక 'కాసుల' మత్తు ఉందనేది బహిరంగ రహస్యం.
ఈ దందాలపై సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో FIR (No. 293/2025) నమోదైంది. సంస్థ ప్రతినిధులు అమరేందర్ రెడ్డి, ధర్మవీర్ రెడ్డిలపై క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ, నిర్మాణాలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు. సాధారణంగా వివాదాల్లో ఉన్న భూముల్లో పనులు నిలిపివేయాల్సి ఉన్నా, ఇక్కడ పోలీసుల ఎఫ్ఐఆర్ ను కూడా బేఖాతరు చేస్తూ పనులు కొనసాగిస్తుండటం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం.
అవినీతి తిమింగలాలు.. ఏసీ గదుల్లో హెచ్‌ఎండీఏ సంతకాలు!
నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన హెచ్‌ఎండీఏ అధికారులు, ఏసీ గదుల్లో కూర్చుని ఫైళ్లు ఎలా క్లియర్ చేశారు? నాగోల్ సర్కిల్ డీసీ రవీందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి మధు తీరుపై బాధితులు మండిపడుతున్నారు. "మాకు సంబంధం లేదు..
హెచ్‌ఎండీఏను అడగండి" అంటూ తప్పించుకోవడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే. మరోవైపు సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. తప్పుడు పత్రాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఈ అధికారుల వాటా ఎంత?.jpeg)
సామాన్యుడా.. జాగ్రత్త!
మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ముతో కొనే ఫ్లాట్లు రేపు వివాదాల్లో చిక్కుకుంటే దిక్కెవరు? రేరా (RERA) నిబంధనలను తుంగలో తొక్కిన ఈ ప్రాజెక్టును నమ్మితే నట్టేట మునగడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
డిమాండ్:
వెంటనే హైడ్రా (HYDRAA) రంగనాథ్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ అక్రమ సామ్రాజ్యంపై దృష్టి సారించాలి. తప్పుడు పత్రాలు సమర్పించిన డెవలపర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవినీతికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 'అరియా' అక్రమాల కోటను కూల్చి అటవీ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
నమిశ్రీ అవినీతి వెనుక ఓ బడా బి.ఆర్.ఎస్ నాయకుని హస్తం ఉన్నట్లు అంచనాలు.. మరిన్ని ఆధారాలతో తదుపరి కథనంలో..
