టీఎన్జీవో కాలనీలో రూ. 3,200 కోట్ల భూమి రక్షణ
- 16 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్.
- ముసాయికుంట, గ్రీన్ బెల్ట్ ఆక్రమణలపై ఉక్కుపాదం
హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీఎన్జీవో కాలనీలో అన్యాక్రాంతమవుతున్న సుమారు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) స్వాధీనం చేసుకుంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 3,200 కోట్ల విలువ చేసే ఈ స్థలం చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను నాటారు.
ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయి విచారణ
గతంలో టీఎన్జీవో ఉద్యోగుల కోసం కేటాయించిన ఈ ప్రాంతంలో.. 2007 నాటి హెచ్‌ఎండీఏ (HMDA) లేఅవుట్ ప్రకారం 10 ఎకరాలను 'ముసాయికుంట'గా, 4 ఎకరాలను 'గ్రీన్ బెల్ట్' (హరిత మండలం) గా, మరో 2 ఎకరాలను ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించారు. అయితే, కొందరు ఉద్యోగ సంఘం ప్రతినిధుల ప్రోద్బలంతో ఈ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ 'ప్రజావాణి'లో వరుస ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన హైడ్రా, రెవెన్యూ మరియు జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టింది. రికార్డులను పరిశీలించి ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించుకున్న అనంతరం, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మొత్తం 16 ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసి, ఎవరూ లోపలికి ప్రవేశించకుండా ఫెన్సింగ్ వేసింది.
స్థానికుల హర్షం
దశాబ్దాల కాలంగా కబ్జా కోరల్లో చిక్కుకున్న విలువైన భూమిని, ముఖ్యంగా చెరువు శిఖం (ముసాయికుంట), పాఠశాల స్థలాన్ని కాపాడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన స్వల్ప కాలంలోనే స్పందించి, భూమాఫియాపై కఠినంగా వ్యవహరించిన హైడ్రా అధికారులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
