అటవీ భూమిలో 'నమిశ్రీ' అక్రమ సామ్రాజ్యం!
అమాయకులను తడిగుడ్డతో గొంతు కోస్తున్న వైనం..
- వెయ్యి కోట్ల సర్కారు భూమి స్వాహా.. పక్కా స్కెచ్‌తో కబ్జా పర్వం
- అనుమతులు ఒకచోట.. నిర్మాణాలు మరోచోట.. ఇదీ 'అరియా' లీల!
- ఫోర్జరీ పత్రాలతో హెచ్‌ఎండీఏకు బురిడీ.. ఎఫ్ఐఆర్ ఉన్నా ఆగని పనులు
- నాగోల్ బండ్లగూడ లో జరుగుతున్న అవినీతి తంతు.. సరూర్నగర్ సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్లు ఆపాలి..!
- మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి , ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, చర్యలు ఎక్కడ..!
- నాగోల్ సర్కిల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపుల మత్తులో నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితి..
- పత్తాలేని..స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్..!
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్, నిఘా విభాగాలు, హైడ్రా రంగనాథ్, దృష్టి సారించి ఈ అవినీతి తంతును ఆపాలని స్థానికుల డిమాండ్..
- మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి...
ఒక అడవిలో వేటగాడు ఒక చిన్న గూడు కట్టుకోవడానికి అనుమతి పొందాడు. కానీ, అడవి కాపలాదారులు కాసుల కక్కుర్తితో కళ్లు మూసుకోవడంతో, ఆ వేటగాడు అడవిలోని సింహం వాటా భూమిని కూడా ఆక్రమించి కోటలు కట్టేశాడు. అమాయక పక్షులన్నీ అది చూసి ఆ కోటలో గూళ్లు కొనుక్కున్నాయి. తీరా రాజుకు తెలిసి కోటను కూల్చేయమంటే, నష్టపోయింది పక్షులే కానీ, జేబులు నింపుకున్న వేటగాడు, కాపలాదారులు కాదు!
కథలో నీతి: అధికారుల అవినీతి ఆకలికి, సామాన్యుల కష్టార్జితం బలికాక తప్పదు.
హైదరాబాద్:
1. అనుమతుల మాటున 'అటవీ' కబ్జా!
* RERA రిజిస్ట్రేషన్ నంబర్: 02400061375
* HMDA బిల్డింగ్ పర్మిషన్ (BP) నంబర్: 001610/BP/HMDA/0341/g1/GHT/2023
*
నమిశ్రీ సంస్థ అరియా ప్రాజెక్టు కోసం సర్వే నంబర్ 121లో అనుమతులు పొందింది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే విస్తుపోవాల్సిందే. అక్కడ ఉన్నది కేవలం 2 ఎకరాల 35 గుంటలే అయితే.. పక్కనే ఉన్న సర్వే నంబర్ 117/6కు చెందిన 4 ఎకరాల అటవీ భూమిని, సర్వే నంబర్ 122లోని మరో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రాజెక్టులో కలిపేశారు. అనుమతులు పొందిన విస్తీర్ణం కంటే రెట్టింపు స్థాయిలో ఆక్రమణలు జరగడం వెనుక అధికారుల అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2. ఏడీ స్కెచ్‌ను మింగేసిన 'అవినీతి' తిమింగలాలు!
ఏడీ శ్రీనివాసులు ఇచ్చిన రెవెన్యూ స్కెచ్‌లో నిర్మాణాలు అటవీ భూమిలో జరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. మరి ఫారెస్ట్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన హెచ్‌ఎండీఏ అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని ఫైళ్లు ఎలా క్లియర్ చేశారు? 'నమిశ్రీ' నుంచి ముట్టిన ముడుపుల మత్తులో అధికారులు అటవీ సంపదను పణంగా పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
3. ఫోర్జరీ 'రాయుళ్ల'పై ఎఫ్ఐఆర్ ఉన్నా బరితెగింపు!
ఈ వ్యవహారంలో ఫోర్జరీ పత్రాల బాగోతం బయటపడటంతో ఆర్డీఓ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. సంస్థ ప్రతినిధులు అమరేందర్ రెడ్డి, ధర్మవీర్ రెడ్డిలపై ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సింది పోయి.. ఇక్కడ రియల్టర్ల అక్రమ నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. పోలీసులకు దొరికినా, అధికారులకు ఆధారాలు ఇచ్చినా పనులు ఆపకపోవడం వెనుక ఉన్న 'అదృశ్య హస్తం' ఎవరిది?
4. మున్సిపల్ అధికారుల 'లూటీ' రాజకీయం!
నాగోల్ సర్కిల్ డీసీ రవీందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి మధు తీరుపై బాధితులు మండిపడుతున్నారు. ఫిర్యాదులు అందినా "మాకు సంబంధం లేదు.. హెచ్‌ఎండీఏను అడగండి" అంటూ తప్పించుకోవడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే. క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన లోకల్ బాడీ అధికారులు ముడుపుల కోసం కళ్లు మూసుకున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ అక్రమ సామ్రాజ్యం వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
5. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 'కాసుల' కటకట!
ప్రాజెక్టు అక్రమమని ఆధారాలతో వార్తా కథనాలు వస్తున్నా, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆపకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. భారీగా చేతులు మారిన ముడుపుల వల్లే అక్రమ డాక్యుమెంట్లకు చట్టబద్ధత కల్పిస్తున్నారా? ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపే ఈ దందాలో రిజిస్ట్రేషన్ శాఖ వాటా ఎంత?
6. సామాన్యుడా.. జాగ్రత్త! నమిశ్రీ నమ్మితే నట్టేట మునగడమే!
మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని రియల్ మాఫియా దోచుకుంటోంది. రేపు ప్రభుత్వం ఈ అనుమతులను రద్దు చేస్తే ప్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటి? 'రేరా' (RERA) నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ ప్రాజెక్టుకు బ్యాంకులు రుణాలు ఎలా ఇచ్చాయి? సామాన్యుల తడిగుడ్డుతో గొంతు కోస్తున్న నమిశ్రీ సంస్థ బాధితులకు జవాబుదారీ ఎవరు?
మున్సిపల్ శాఖామాత్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమ సామ్రాజ్యంపై దృష్టి సారించాలి. అవినీతి అధికారుల భరతం పట్టి, అటవీ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు..jpeg)
.jpeg)
