
కరీంనగర్ :
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ మహాశక్తి దేవాలయంలో శుక్రవారం నుండి శ్రీ శివ వైభవం (పురాణం) గురించి ప్రవచనములు ఆరంభం కానున్నాయి. పౌరాణిక ప్రవర, ప్రవచన చక్రవర్తి, వేదమూర్తులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి ప్రియశిష్యులు, బ్రహ్మశ్రీ డా గర్రెపల్లి మహేశ్వర శర్మ చే అక్టోబర్ 31 నుండి నవంబర్ 6 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8:30 నిమి.ల వరకు, పవిత్ర కార్తీక మాస పంచపర్వ దినాలు అయినటువంటి ఏకాదశి , ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి (కార్తీక పౌర్ణమి) సందర్భంగా ఈ శ్రీ శివ వైభవం పై ప్రవచన కార్యక్రమం కొనసాగనుంది. శ్రీ శివ వైభవ ప్రవచనములలో ముఖ్యంగా శివ తత్వం, మహిమ, తదితర ఘట్టాలు, అంశాలు వివరించే ఆమూల్యమైన ప్రసంగాలను ఆధ్యాత్మిక గురువులు గర్రెపల్లి మహేశ్వర శర్మ తెలియజేయనున్నారు. సమస్త హిందూ బంధువులందరూ ప్రతిరోజు సాయంత్రం శ్రీ శివ వైభవ ప్రవచనాల కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.
నవంబర్ 2న తులసి దామోదర కళ్యాణం :
కార్తీక ద్వాదశిని పురస్కరించుకొని శ్రీ మహాశక్తి దేవాలయంలో నవంబర్ 2 సాయంత్రం 6:30 నిమి.ల నుండి శ్రీ తులసి దామోదర కళ్యాణం జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కావున భక్తులు ఈ కల్యాణంలో పాల్గొని ఆ తులసి దామోదరుని ఆశీస్సులు పొందాలని కోరారు.
నవంబర్ 5న సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు :
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ మహాశక్తి దేవాలయంలో నవంబర్ 5 ఉదయం 7:30 నిమి.ల నుండి సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.