సరికొత్త చరిత్ర.. తమిళనాడు మంత్రికి తెలంగాణ నేల పై ఆత్మీయ స్వాగతం!
59 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో చోటు.. విశ్వనాథన్‌ను అభినందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్:
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల నేతలు పలు ఆసక్తికర అంశాలపై చర్చించారు. తొలుత విశ్వనాథన్.. పొంగులేటికి పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
*ఘన సన్మానం – జ్ఞాపకాల బహుమతి
తమిళనాడులోని వేలూరు శాసనసభ నియోజకవర్గం (అసెంబ్లీ స్థానం) నుండి ఘన విజయం సాధించి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం పర్యావరణ హితాన్ని చాటేలా ఒక పూల మొక్కను జ్ఞాపికగా అందజేసి అభినందనలు తెలిపారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
*ప్రజల ఆశయాలే ఊపిరిగా..
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్వనాథన్ సాధించిన విజయం సాధారణమైనది కాదని కొనియాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విశ్వనాథన్ తన శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ భేటీ ఇరు రాష్ట్రాల నేతల మధ్య ఆత్మీయతను, రాజకీయ బంధాన్ని మరింత బలోపేతం చేసింది.
