సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలి
- ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దు: కలెక్టర్‌కు వినతిపత్రం
- భూమి కేటాయిస్తే రాజీనామాలకు సిద్ధం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరిక
*కొంగరకలాన్
ప్రజల సంక్షేమాన్ని, ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కొంగరకలాన్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' రంగారెడ్డి జిల్లా స్థాయి సమావేశంలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వివాదం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కొత్తూరు మండలంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి కేటాయించవద్దని కోరుతూ కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల సర్పంచులు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
*ప్రజాప్రతినిధుల తీవ్ర నిరసన
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలోనే స్థానిక ప్రజాప్రతినిధులు తమ నిరసనను గట్టిగా వినిపించారు. అధికారులు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకూడదని, ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు.
ఈ డిమాండ్‌కు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన కలెక్టర్‌తో మాట్లాడుతూ... ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయిస్తే ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. సిద్ధాపూర్ పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
