సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం: సీపీఎం

  • *ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు, తోపుడు బండ్ల తొలగింపు దుర్మార్గం
  • * పాలకులది అవినీతి, కార్పొరేట్ రాజకీయం.. సుందరయ్యే మనకు ఆదర్శం
  • *వనస్థలిపురంలో పుచ్చలపల్లి 41వ వర్ధంతి వేడుకలు

సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం: సీపీఎం

*వనస్థలిపురం:
ప్రజలపై మోయలేని భారం వేస్తూ, ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లను, వీధి వ్యాపారుల తోపుడు బండ్లను అక్రమంగా తొలగిస్తే ఊరుకునేది లేదని, సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీపీఎం స్పష్టం చేసింది. మంగళవారం వనస్థలిపురం రైతు బజార్ చౌరస్తాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ నిర్వహించారు. సీపీఎం ఎల్బీనగర్ పరిధి అధ్యక్షురాలు ఎ. రాధమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. చంద్రమోహన్, ఎల్బీనగర్ పరిధి కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

*ఆస్తిపై వ్యామోహం వద్దనే.. పిల్లలు కనలేదు!
ఈ సందర్భంగా ఎం. చంద్రమోహన్ మాట్లాడుతూ.. పేదల కూడు, గూడు, గుడ్డ వంటి కనీస అవసరాలు, మౌలిక వసతుల కల్పన కోసం పార్లమెంటు లోపలా, బయటా నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు.

"భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ, తన వాటాకు వచ్చిన భూమినంతా పేద ప్రజలకు పంచిపెట్టిన ఆదర్శ నాయకుడు ఆయన. పిల్లలు పుడితే ఆస్తిపై, కుటుంబంపై వ్యామోహం పెరుగుతుందనే ఉద్దేశంతో సుందరయ్య దంపతులు స్వచ్ఛందంగా సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించుకున్నారు."
*ఎం. చంద్రమోహన్, సీపీఎం జిల్లా నేత

*నేటి రాజకీయాలు కార్పొరేట్ మయం..
సీపీఎం ఎల్బీనగర్ పరిధి కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ.. 'దున్నేవాడికే భూమి కావాలి', 'ప్రతి పేదవాడికీ ఇల్లుండాలి' అనే లక్ష్యాలతో శాసనసభలో, పార్లమెంటులో సుందరయ్య గళమెత్తారని గుర్తుచేశారు. గన్నవరం శాసనసభ్యుడిగా నిస్వార్థంగా సేవలందిస్తూ కమ్యూనిస్టు విలువలను కాపాడారని, నాడు పేదల కష్టాల్లో ఉచిత గంజి కేంద్రాలు, కిలో రూపాయి బియ్యాన్ని అందించిన ఘనత ఆయనదేనన్నారు.
కానీ, నేటి రాజకీయాల్లో విలువలు నశించాయని, వార్డు సభ్యుడు, కార్పొరేటర్, శాసనసభ్యుడు కాగానే ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలను కార్పొరేట్ మయం చేస్తూ పాలకులే ప్రజలను దోచుకుంటున్నారని, నేటి తరం నాయకులు సుందరయ్య జీవిత చరిత్రను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

*సీపీఎం ప్రధాన డిమాండ్లు:
 *ధరలు తగ్గించాలి:
 విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు మున్సిపల్ ఇండ్ల పన్నులను వెంటనే తగ్గించాలి.

 *డబుల్ బెడ్రూం ఇళ్లు పంచాలి: రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులైన పేదలకు తక్షణమే పంపిణీ చేయాలి, లేదంటే ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.

 వైన్స్ దుకాణాలు తొలగించాలి: జాతీయ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలి.
 
యుద్ధం వద్దు - శాంతి కావాలి: అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో ఇరాన్‌పై జరుగుతున్న అనాలోచిత యుద్ధాన్ని తక్షణమే ఆపాలి. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ప్రపంచానికి యుద్ధం వద్దు.. శాంతి కావాలి.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు భారతమ్మ, కాశమ్మ, అర్జున్, మల్లేష్, ఝాన్సీ, శాంతి భాయ్, అంజి నాయక్, మల్లయ్య, నిర్మలమ్మ, కుమారి, కుద్బుద్దీన్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

About The Author