బంగ్లాదేశ్ హిందువులది అరణ్య రోదనేనా?
మళ్లీ మొదలైన హింసాకాండ
భారత శక్తి ప్రత్యేక ప్రతినిధి, జూలై 30:
బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏమీ మారలేదు. ఇంకా హిందువులపై ముస్లిం ఛాందసుల దాడులు రోజు రోజుకీ పెరుగుతూనే వున్నాయి. రెండు రోజుల క్రితం తాజాగా ముస్లిం ఛాందసులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. రంగపూర్ లోని గంగాచార లోన బెట్ గరి యూనియన్ లో ముస్లిం ఛాందసులు హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని, దాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా 15 హిందువుల ఇళ్లను కూడా ఛాందసులు దోచుకున్నారు. ధ్వంసం కూడా చేశారు. 50 కి పైగా హిందూ కుటుంబాలు ఆ ప్రాంతం నుంచి భయపడుతూ వలస వెళ్లిపోయారు.
అయితే.. 18 ఏళ్ల హిందూ బాలుడు దైవ దూషణకు దిగాడని ఆరోపిస్తూ.. ఛాందసులు ఇంత విధ్వంసాన్ని సృష్టించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణకు ఎక్కడా సాక్ష్యాలు లేవు. అయినా హిందువులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు దిగారు. రోంజోన్ అనే హిందూ బాలుడు మహ్మద్ ప్రవక్త విషయంలో సోషల్ మీడియా వేదికగా అవమానకర వ్యాఖ్యలు చేశారన్నది ఛాందసుల ఆరోపణ. దీనికి రుజువులు మాత్రం చూపించలేకపోయారు. దీనిని సాకుగా చూపించి ఈ నెల 26 సాయంత్రం నుంచి ముస్లిం ఛాందసులు హింసకు దిగారు. 500 నుంచి 600 మంది వరకు ముస్లింలు మధ్యాహ్నం నమాజ్ తర్వాత కర్రలు, రాడ్లు, కొన్ని ఆయుధాలతో గుమిగూడారు. అంతేకాకుండా హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ నానా విధ్వంసానికి దిగారు.
అక్కడి ప్రాంతాలు యుద్ధ వాతావరణాన్నే తలపించాయి. హిందువులు తరతరాలుగా వస్తున్న తమ ఇళ్లు, ఆస్తులను వదిలిపెట్టి, ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని వెళ్లిపోయారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం హిందువులకు రక్షణ కల్పించలేకపోయారని, మొదట్లో కాస్త ప్రయత్నాలు చేసినా.. ఆ తర్వాత పట్టించుకోలేదని స్థానిక హిందువులు అంటున్నారు. ‘‘మా లాంటి అమాయకులను ఇళ్లను ఎందుకు ధ్వంసం చేసి దోచుకున్నారు? అసలు మేము ఏమీ చేయలేదు. అయినప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాం.’’ అని ఓ హిందూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ గొడవలు జరిగిన మూడు రోజులు కావస్తున్నా... బాధ్యులెవ్వర్నీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా వారి జాడ కూడా కనిపించడం లేదు.