వంగా మధుసూదన్ రెడ్డికి మధుయాష్కి నివాళి..

చంపాపేట కార్పొరేటర్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రచార కమిటీ చైర్మన్

వంగా మధుసూదన్ రెడ్డికి మధుయాష్కి నివాళి..

ఎల్బీనగర్:

 అకాల మరణం చెందిన చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి భౌతికకాయానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆదివారం ఘన నివాళులర్పించారు. కర్మన్ఘాట్‌లోని మధుసూదన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన, మృతదేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం జరిగిన అంతిమయాత్రలో మధుయాష్కి గౌడ్ స్వయంగా పాడె మోశారు. భూపేష్ గుప్తా నగర్‌లోని స్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొని, దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. తన ఆత్మీయ సోదరుడు మధుసూదన్ రెడ్డిని కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవలో నిరంతరం తపించే నాయకుడిని కోల్పోయామని పేర్కొంటూ భావోద్వేగంతో తుది వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About The Author