మతోన్మాద శక్తులపై కొట్లాడడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి.
రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బాపూజీ వర్ధంతి
హస్తినాపురం:
దేశంలో పెచ్చుమీరుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావడమే మహాత్మా గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సెక్రటరీ చెన్నోజు శ్రీనివాసులు అన్నారు. హస్తినాపురంలో శుక్రవారం రోజున రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతిని 'మతోన్మాద వ్యతిరేక దినం'గా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. మత సామరస్యం కోసం పాకులాడిన మహాత్ముడిని హిందూ మతోన్మాద శక్తులు దారుణంగా పొట్టనబెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అవే శక్తులు అధికారంలో ఉండి ప్రజల మధ్య విషం చిమ్ముతున్నాయని, లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. మతోన్మాద, మతాధిపత్య రాజకీయాలు నశించాలని, శాంతి సామరస్యాలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
ఉపాధి హామీ పేరు మార్చొద్దు..
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని చూడటం సరికాదని, ఆ పేరును అలాగే కొనసాగించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో బైండ్ల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నందిగామ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పొట్టపెంజర రమేష్, బుడిగపాక గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
