రోడ్లపై పరుగులు తీస్తున్న దోపిడీ చక్రాలు..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- సామాన్యుల గుండెల్లో రగులుతున్న ఆవేదనా మంటలు.. 
- పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వ రవాణా వ్యవస్థ.. 
- ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న దౌర్భాగ్యం.. 
- పండుగల సీజన్ మొదలైంది.. ప్రజలు దోపిడీకి బలౌతున్నారు.. 
- ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యంతో అంటకాగుతున్న ప్రభుత్వ యంత్రాంగం.. 
- ప్రైవేట్ ట్రావెల్స్ లో వంద రూపాయల టికెట్ 500 వందల పైమాటే.. 
- పూర్తిగా బధ్రతాప్రమాణాలను పాటించని వైనం.. 
- తరచుగా ప్రమాదాలకు గురౌతున్న ప్రవేట్ వాహనాలు.. 
- అమాయకుల ప్రాణాలంటే ప్రభుత్వానికి, ప్రైవేట్ యాజమాన్యాలకు లెక్క లేదు.. 
- ప్రైవేట్ లో పెరిగిన వ్యాపార దాహం.. అధికారుల్లో అక్రమార్జన దాహం.. 
- ఏకంగా ఆర్.టి.సి.ని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందా..? 
- వందల కోట్ల విలువైన ఆర్.టి.సి. ఆస్థులను అమ్ముకునే భయంకర వ్యూహం.. 
- ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం.. 
- ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

download (1)

ప్రజల జీవితాల్లో ప్రయాణం ఒక భాగమై పోయింది.. చుట్టాలింటికే వెళ్లాలన్నా, సొంత ఊళ్లకు వెళ్లాలన్నా, తీర్థయాత్రలకు వెళ్లాలన్నా ప్రయాణ సాధనాలు  ఎంతో ముఖ్యం.. పూర్వాశ్రమంలో నడుస్తూనే మైళ్లకు మైళ్ళు ప్రయాణం చేసేవారంట.. కొంతమంది బండ్లు కట్టుకుని ప్రయాణాలు సాగించేవాళ్ళు..  ఆ తరువాత ఇతరత్రా ప్రయాణ సాధనాలు అందుబాటులోకి వచ్చాక.. జర్నీ అనేది సులభమైపోయింది.. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్.టి.సి. సంస్థ పేదోళ్ల ప్రయాణ సాధనంగా గణతికెక్కింది.. తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా  ప్రయాణం చేసే వెసులుబాటు కలిగింది.. రైళ్లు, ఫ్లైట్స్ లు ఉన్నా.. ఆర్.టి.సి. అనేది ఒక ఆత్మీయబంధంగా మారిపోయింది..  కాలానుగుణంగా ప్రైవేట్ సంస్థలు బస్సులు నడపడం మొదలుపెట్టాయి.. ఈ ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది ప్రభుత్వం..  బాగానే వుంది.. కొన్ని విధి విధానాలు పాటిస్తూ.. చట్టబద్ధంగా నడుపుకుంటే పర్వాలేదు.. కానీ రాను రాను ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ పర్వానికి తెరలేపాయి.. కారణం ఏమిటంటే తగినన్ని ప్రభుత్వ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణీకులు  ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గుచూపసాగారు.. దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టమొచ్చినట్లుగా ప్రైవేట్ యాజమాన్యం  ప్రయాణికులను దోచుకోవడం మొదలు పెట్టారు.. మరీ పండుగ సీజన్ లో అయితే ఈ దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది..     

 

ఈరోజుల్లో నగరాలనుంచి గ్రామాల దాకా ప్రయాణం ప్రజల జీవితంలో భాగమైపోయింది. అయితే ప్రజా రవాణా వ్యవస్థ బలహీనపడటంతో, ఆ అవసరాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు తమ వ్యాపార దాహంతో వినియోగించుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను కాకుండా లాభాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న ఈ సంస్థలు, కొన్నిసార్లు చట్టాలను కూడా తుంగలో తొక్కుతూ సామాన్యుడిని దోచుకుంటున్నాయి అన్నది వాస్తవం.. 

ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలహీనమైపోయింది : 

ప్రభుత్వ బస్సు సంస్థలు అంటే ఆర్.టి.సి. లాంటివి ఒకప్పుడు ప్రజల కోసం చవకగా, సురక్షితంగా సేవలందించేవి. కానీ ఇప్పుడు అవి పలు కారణాలతో బలహీనమయ్యాయి.. ఎప్పుడు చూసినా నష్టాల్లో ఆర్.టి.సి. అనే మార్థాలు వినిపిస్తూ ఉంటాయి.. కాగా ప్రభుత్వాలు సరిపడ నిధులు కేటాయించకపోవడం  వల్ల వాహనాలు పాతబడి పోయాయి, సాంకేతిక సదుపాయాలు వెనుకబడ్డాయి.

ఇక డ్రైవర్లు, కండక్టర్లు తక్కువగా ఉండటం వల్ల ప్రయాణ రూట్లు తగ్గిపోయాయి. దీనికి తోడు అవినీతి, లంచాలు తీసుకుని అక్రమ నియామకాలు, ఆడిటింగ్ లోపాలు తదితరాలు సంస్థల ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణింపజేశాయి. మరీ ముఖ్యంగా రాక్షస రాజకీయ ప్రభావంతో ప్రభుత్వాలు ఆర్.టి.సి. లో ప్రైవేట్ వాహనాల కొనుగోలుకు మార్గం సుగమం చేస్తూ ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచాయి.

ప్రైవేట్ ట్రావెల్స్ పెరుగుదల : 

ఈ రకంగా ప్రభుత్వ రవాణా వెనుకబడిన క్రమంలో, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు మార్కెట్‌లో దూసుకుపోయాయి. కానీ ఇవి ప్రజా సేవ కంటే లాభాల కోసం పరిగెడుతున్న వ్యాపార యంత్రాలు మాత్రమే.

ప్రైవేట్ రంగ దోపిడీ పలురకాలుగా ఉంటుంది.. పండుగలు, సెలవులు, వారాంతాలు వచ్చినప్పుడు సాధారణ టికెట్ రేటుకు 3–5 రెట్లు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో తప్పుడు సీట్లు చూపించి, చివరి నిమిషంలో వాహనాలను మార్చడం జరుగుతోంది. ఇదిలా ఉంటే అనేక వాహనాలు పర్మిట్ లేకుండా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత వహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చట్టం నిర్దేశించిన రేట్లను ఉల్లంఘించి తమ ఇష్టం వచ్చినట్లుగా ధరలు నిర్ణయిస్తున్నారు.

అంతే కాదు వాహనాల పరిస్థితి దారుణంగా ఉండడం జరుగుతోంది..  డ్రైవర్ల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు లేకపోవడం వంటి సమస్యలు విస్తృతంగా ఉన్నాయి. ప్రైవేట్ బస్సుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అతివేగం, డ్రైవర్లకు తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ఇలాంటి ఘటనల్లో బాధ్యత ఎవరు వహించాలో స్పష్టంగా ఉండదు.. ట్రావెల్స్ యజమానులు తప్పించుకుంటారు, ప్రభుత్వం మాత్రం పక్కన నిలబడుతుంది.

ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది :  
నియంత్రణ లేకుండా దోపిడీ జరుగుతోంది :

ప్రైవేట్ ట్రావెల్స్ నియంత్రణ కోసం పలు చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలతో రాజకీయ పెద్దల  సంబంధాలు కొనసాగుతున్నాయి.. మరీ ముఖ్యంగా ఎంతోమంది రాజకీయ పెద్దలే ప్రైవేట్ బస్సులను  నడుపుతున్నారు.. ప్రభుత్వంలో భాగస్వాములు అవడం వల్ల చట్టాలు, నిబంధనలు వీళ్ళు పాటించడం లేదు.. అలాగే సంబంధిత అధికారులను సైతం కొనేస్తున్నారు..  దీంతో ట్రాన్స్‌పోర్ట్ శాఖ సకాలంలో తనిఖీలు చేయడం లేదు. అవినీతి అలవాటుపడ్డ అధికారులు అనుమతులు సులభంగా ఇచ్చేస్తున్నారు.. ఇంకా ఎవరైనా ఎదురుదిరిగి ప్రశ్నిస్తే దాడులకు కూడా వెనుకాడటం లేదు.. 

దీనికి తోడు ప్రయాణికుల ఫిర్యాదులను పట్టించుకునే వ్యవస్థ అనేది అసలు లేదు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు "మనమే చట్టం" అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది..  నేరుగా సామాన్యుడిపైనే పడుతోంది.. 
ఎలాగ అంటే చవకగా ప్రయాణం సాధ్యం కావడం లేదు..  సురక్షితం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగించి రావడం.. 
గ్రామీణ, దూర ప్రాంతాలకు రవాణా అందుబాటులో లేకపోవడం..  విద్యార్థులు, కార్మికులు, చిన్న వ్యాపారులపై ఆర్థిక భారాలు పెరగడం

పరిష్కార మార్గాలు లేవా అంటే ఉన్నాయి  : 

ముఖ్యంగా ప్రజా రవాణా పునరుద్ధరణ జరగాలి.. ఆర్.టి.సి. లకు నిధుల మంజూరు చేసి ఆధునీకరించడం. గ్రామీణ ప్రాంతాల వరకు విస్తృత రవాణా నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి.. ప్రైవేట్ వాహనాలపై కఠిన నియంత్రణ, రేట్లపై పర్యవేక్షణ జరగాలి.. ప్రయాణికుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు జరగాలి.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కేవలం  ప్రజా ప్రయోజనాలకే పరిమితం చేయాలి.. 

ఎందుకంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల  ప్రజల హక్కులపై దాడి జరుగుతోంది.. రవాణా వ్యాపార మాఫియా రెచ్చిపోతోంది..  ప్రజల కనీస అవసరమైన రవాణా సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీ జరుగుతోంది.. ప్రజలకు అందుబాటు, భద్రత, న్యాయమైన ధరలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అది జరగకపోతే, రోడ్లపై పరిగెడుతున్న ఈ బస్సులు కేవలం చక్రాలమీద తిరిగే లాభ యంత్రాలు మాత్రమే అవుతాయి అని మేధావులు వాపోతున్నారు.. 

పైగా ఆర్.టి.సి. కి సంబంధించిన కోట్లవిలువైన ష్ఠిరాస్తులపై ప్రభుత్వ, రాజకీయ కీచకుల కన్ను పడిందని, ఆ ఆస్తులను కొల్లగొట్టడంకోసం  సంస్థను ప్రైవేట్ పరం చేస్తే సులువు అవుతుందనే కుట్రలు ప్రభుత్వాలు చేస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే ఇలాంటి చర్యలు జరిగిన దాఖలాలు  ఉన్నాయి.. ఆర్.టి.సి. కి సంబంధించిన ఆస్థులను ప్రైవేట్ వాళ్లకి కారు చౌకగా అప్పగించిన దుశ్చర్యలు కూడా చూశాం.. ఇక మీదట ఇలాంటివి జరగకూడదని, కృంగిపోయిన ఆర్.టి.సి. జవసత్వాలను తిరిగి తీసుకురావాలని.. అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాను  కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని, ఆర్.టి.సి.కి సంబంధించిన కోట్ల విలువైన ఆస్థులను  పరిరక్షించాలని కోరుతూ ఒక ఉద్యమానికి పూనుకుంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..    

About The Author