అమీన్‌పూర్‌లో ఆక్రమణల ‘హైడ్రా’ కట్టడి
861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్.. అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్:
అమీన్‌పూర్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు 'హైడ్రా' (HYDRAA) చేపట్టిన భారీ ఆపరేషన్ రెండో రోజూ ముమ్మరంగా కొనసాగింది. సుమారు 861 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమికి రక్షణగా ఫెన్సింగ్ పనులు చేపట్టిన అధికారులు, అదే ప్రాంతంలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.
నిరంతరాయంగా కూల్చివేతలు*
శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రాత్రి విరామం మినహా ఆదివారం కూడా కొనసాగింది. ప్రధానంగా ముఖీమ్ సోదరుడు అజీమ్ నిర్మించిన ఆరు అంతస్తుల అక్రమ భవనాన్ని తొలగించడంపై అధికారులు దృష్టి సారించారు. ఆదివారం సాయంత్రానికి ఈ భవనం కూల్చివేత 90 శాతానికి పైగా పూర్తయింది. పక్కనే ఉన్న ఇతర అపార్టుమెంట్లు, నివాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా కూల్చివేతలు చేపట్టడం వల్ల ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగినా, లక్ష్యాన్ని మాత్రం పక్కాగా అమలు చేశారు.
సర్వే నంబర్ల వారీగా ఆక్రమణకు గురైన, ఖాళీగా ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, చుట్టూ ఫెన్సింగ్ నిర్మించే పనులను వేగవంతం చేసింది. ఈ భారీ విస్తీర్ణంలో అక్రమార్కులు చొరబడకుండా శాశ్వత ప్రాతిపదికన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
స్థానికుల్లో భరోసా
హైడ్రా చర్యల పట్ల స్థానిక ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. గతంలో భూకబ్జాదారుల ఆగడాలతో భయం భయంగా గడిపిన సామాన్యులు, ఇప్పుడు ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయడాన్ని స్వాగతిస్తున్నారు.
నిరుపేదలకు ఊరట:
సామాన్యుల ఇళ్లను కూల్చబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీతో తమ ఆందోళనలు తొలగిపోయాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా రాకతో ప్రభుత్వ భూములకు భద్రత పెరగడమే కాకుండా, సామాన్యులకు వ్యవస్థపై నమ్మకం కలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా కబ్జాదారుల గుండెల్లో హైడ్రా గజగజలాడించింది అనడంలో సందేహం లేదు.
