ధర్మస్థల దేవాలయంపై తప్పుడు ప్రచారాలు చేయడం పెద్ద తప్పు : బీజేపీ
బెంగళూరు, భారత శక్తి ప్రతినిధి, జూలై 23:
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో 1998 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి, సామూహిక ఖననం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై పెద్ద దుమారం రేగింది. దీనిపై బీజేపీ స్పందించింది.దీనిపై ప్రభుత్వం స్పందించింది, సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత ఆర్. అశోక ప్రకటించారు. అయితే.. ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అది చాలా పెద్ద తప్పు అని అన్నారు.
మరోవైపు ఈ విషయంపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని, ఎవర్నో ఇరికించాలన్న ఉద్దేశంతో దర్యాప్తు జరగకూడదని నొక్కి చెప్పారు.అయితే ధర్మస్థల దేవాలయం విషయంలో ఓ వ్యక్తి మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నాడని, దీనిపై కేరళ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుందన్నారు. అయితే..శబరిమల ఆలయం, దాని సంబంధిత అంశాలను కేరళ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో అందరికీ తెలిసిందేనని విమర్శించారు.
‘‘వేల మృతదేహాలు నిజంగా దొరికితే, ఆయా కుటుంబాలు ఫిర్యాదులు చేస్తాయి కదా. మరి అలాంటి ఎన్ని కేసులు, ఫిర్యాదులు వచ్చాయో ప్రభుత్వం స్పష్టం చేయాలి. దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి మతపరమైన ప్రదేశాల సమీపంలో ప్రజలు మరణిస్తారు. అలాంటి సందర్భాలలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తారు.20 ఏళ్లుగా లేని తొందర ఇప్పుడే ఎందుకు పడుతున్నారు? అకస్మాత్తుగా అలాంటి జ్ఞానాన్ని ఎలా పొందారు? ఓ మతాన్ని అవమానించడానికి వివాదాన్ని రేపడం ఎంతమాత్రమూ ఆమోదయో్యం కాదు. ఈ అంశానికి, ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయానికి అసలు సంబంధమే లేదు. దీని విషయంలో కొందరు కావాలే తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు’’ అని అశోక మండిపడ్డారు.
అంతేకాకుండా ఎవరైనా తప్పు చేసిన ఆరోపణలు వస్తే.. నేరుగా ఆ వ్యక్తిపైనే ఆరోపణలు చేయాలి. మొత్తం సంస్థపై కాదని అన్నారు. అలాగే ఈ విషయంలో ఏర్పాటైన సిట్ కి ఇతరత్రా పనులు అప్పజెప్పవద్దని, ఈ విషయాన్నే కూలంకషంగా దర్యాప్తు చేసేలా సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి దోషులెవరైనా వారికి శిక్షపడాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో 1998 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి, సామూహిక ఖననం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై పెద్ద దుమారం చెలరేగడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అంతర్గత భద్రతా విభాగం) ప్రణబ్ మొహంతి నేతృత్వంలో సిట్ పనిచేస్తుంది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిక్రూట్‌మెంట్) ఎం ఎన్ అనుచేత్, ఐపీఎస్ అధికారులు సౌమ్యలత, ఎస్ కె, జితేంద్ర కుమార్ దయామా ఆయనకు సహాయం చేస్తారు.
గత 20 సంవత్సరాలుగా ధర్మస్థల ప్రాంతంలో తప్పిపోయిన మహిళలు, బాలికలపై వివరణాత్మక సమాచారం కోరుతూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలకు లేఖ రాయడంతో ప్రభుత్వం స్పందించింది. “తమ పిల్లల అదృశ్యం లేదా మరణం కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు సిబ్బంది సరిగ్గా స్పందించలేదని చాలా కుటుంబాలు ఆరోపించాయి” అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలై 3న తన న్యాయవాదుల ద్వారా పోలీసులను ఆశ్రయించిన మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదుతో తొలుత దర్యాప్తు ప్రారంభమైంది.