భక్తిరస భరితం శ్రీ కృష్ణ తత్వం
కన్నయ్య ఎప్పుడూ అమ్మ యశోద దగ్గర చేరి “తల దువ్వి పింఛం పెట్టవే! ఓ యమ్మా! నన్ను గోపాల కృష్ణుడనవే!" అని అడుగుతూ ఉండేవాడు. అప్పుడు యశోదమ్మ “కన్నా! నీవు చక్కగా పాలు త్రాగితే నీ కురులు ఒత్తుగా ఎదుగుతాయి. అప్పుడు నీకు చక్కగా జుట్టు దువ్వి, పింఛం పెడతాను. చక్కగా పాలు త్రాగు." అంటూ బుజ్జగించేది! అలా అమ్మ కరస్పర్శా మృతంతో ఒత్తుగా పెరిగి, మెడ మీద దోబూచులాడే కన్నయ్య కురులు తల దువ్వి నెమలి పింఛం పెట్టేలా ఎదిగాయి.
అహం వీడితే అంతా భక్తి భావనే
యమునా నదీ సైకతాల్లో ఆడి, పాడి, అలసి సొలసి చెట్ల క్రింద అంతా చేరగిల పడితే, పొన్నమాను కొమ్మ మధ్యన కూర్చుని, కన్నయ్య పిల్లనగ్రోవిని ఊదడం మొదలు పెట్టేవాడు. ఆ మురళీ గానంలో జగత్తు రసమయం అయిపోయేది. గోపబాలకులు కొందరు ఆ కృష్ణ పాదాల దగ్గర జారగిలపడి, కొందరు పాదాలు పట్టుకుని, కొందరు తన్మయంతో, ఆర్తితో చేతులు చాచి ఆ రసమయ జగత్తులో ఓలలాడుతూ ధన్యులు అవుతున్నారు. గోవులు మోరలు ఎత్తి, అరమోడ్పు కన్నులతో గోవిందుని చూస్తూ, మురళీ గాన రసాస్వాదనలో దేహాలు పులకించి, ఆపలేని చేపుతో, పాలధారలతో పృథ్వికి అభిషేకం చేస్తున్నాయి. లేగదూడలు గోమాతలు స్రవించే పాలను త్రాగాలన్న తలపే లేక, చెవులు రిక్కించి, నాదోపాసకుల్లా తోకలు ఎత్తి కన్నయ్య ముఖంలోకి తన్మయత్వంగా చూస్తున్నాయి. ఆ మాధవుని ముఖతః జాలువారే ఆ నాదరస వాహిని ప్రాణికోటి జన్మాంతర కర్మల భవబంధాలను పటాపంచలు చేస్తున్నది. అంతా తేజోమయం, రసమయం.
సమర్పణతో పరమాత్మ దర్శనం
ఊయల మంచం మీద మెత్తని పానుపు వేసి కన్నయ్యను మురిపెంగా పడుకోపెట్టింది. కన్నయ్య తలను నెమ్మదిగా నిమురుతూ, ఎన్ని జన్మల పుణ్యమో తన కొంగు బంగారం అయిందని మురిసిపోతూ ఊయలను ఊపసాగింది. రాజీవ లోచనుడు కనులను నెమ్మదిగా అరమూతలు వేశాడు. బిడ్డ నిద్రించాడనుకున్నది అమ్మ యశోద. కానీ సృష్టిలో తనను తాను బందీ చేసుకున్న ఆ బాలపరమాత్మకు నిద్ర ఎక్కడిది? అయినా ఎందరో తల్లులు, ఎందరో భక్తులు ప్రతి నిత్యం ఆ పరమాత్మకు సమర్పణ చేసే భక్తి ఉపచారాలు ఇవే. ఆ తల్లి యశోదలా, ఆ గోపబాలకుల్లా, పరమాత్మను నిత్యం లాలించి పాలించే ఇంట్లో దీపకళికల్లాంటి పసివాళ్ళు, అనంత రూపుడైన పరమాత్మకు ప్రతిరూపాల్లా నట్టింట నడయాడతారనేది తరతరాల భారతీయ సంప్రదాయపు భక్తి ఒరవడి. అదే అందరికీ అవశ్యం ఆచరణీయం. ఇహపరాలకు ప్రథమ సోపానం.
"సాహిత్య కళా విభూషణ" స్వర్ణ నంది పురస్కార గ్రహీత
- చౌడూరి నరసింహారావు
సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక విశ్లేషకులు, ప్రవచన కర్తలు