సన్న రకం వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి : ఆర్డీవో సదానందం
సిద్దిపేట:
సన్న రకం వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆర్డీవో సదానందం అన్నారు. వానాకాలం - 2026 సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందుల సరఫరాపై దుబ్బాక డివిజన్ పరిధిలోని డీలర్లతో దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ అధికారి సదానందం మాట్లాడుతూ రైతులు సన్న రకం వరి సాగు చేసేలా డీలర్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం సన్న రకాల వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్న నేపథ్యంలో బీపీటీ–5204, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, KNM–1638, WGL–44, WGL–962, JGL–1798 వంటి సన్న రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఈ రకాల సాగుతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌తో పాటు మిల్లింగ్ నాణ్యత మెరుగ్గా ఉండి రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరైన సమయంలో అందేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించారు.అనంతరం
దుబ్బాక ఏడీఏ కాంపాటి మల్లయ్య మాట్లాడుతూ ప్రతి డీలర్ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ ఉన్న కంపెనీల ఉత్పత్తులనే విక్రయించాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల ధరల పట్టికలను షాపుల వద్ద ప్రదర్శించడంతో పాటు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు. అధిక ధరలకు విక్రయాలు చేసినట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించి రోజువారీ అమ్మకాలు, నిల్వలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, దుబ్బాక సీఐ రాజేష్, ఏఓలు మోహన్, మల్లేష్, సత్యనేష్, ఎస్సై రవికాంత్ రావు, ఏఈఓలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
