పేదరికపు కోరల్లో సామాన్యుడు..!

పేదరికపు కోరల్లో సామాన్యుడు..!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, ఆర్థిక అనిశ్చితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన ఆందోళన ముమ్మాటికీ ఆలోచించదగ్గది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని, అక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రాన్ని కళ్లకు కట్టింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు గనక వేగంగా మెరుగుపడకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిక జనాభా మళ్లీ పేదరికపు కోరల్లోకి జారిపోయే ప్రమాదం ఉందన్న ఆయన హెచ్చరిక అత్యంత యదార్థం. ఈ దశాబ్దం ప్రారంభం నుంచే ప్రపంచాన్ని విపత్తులు వెంటాడుతున్నాయి. మొదట కోవిడ్ మహమ్మారి మానవాళిని పట్టిపీడించి, ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఆ గాయం మానకముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చెలరేగింది. ఇది చాలదన్నట్లు, తాజాగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య మొదలైన సైనిక ఘర్షణలు ప్రపంచాన్ని మరింత ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి దిగ్బంధం కావడం వల్ల గల్ఫ్ దేశాల నుండి ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేటికీ కొనసాగుతున్న ఈ సంక్షోభం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలు నిలిచిపోయి, ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చమురు ధరల పెరుగుదల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లకే పరిమితం కాలేదు. ఇటీవలే భారతదేశం కూడా పెట్రో ధరలను పెంచక తప్పలేదు. రాబోయే రోజుల్లో ఇవి మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. ఇంధన ధరల పెరుగుదల కేవలం రవాణా రంగానికే పరిమితం కాదు; ఇది నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, ద్రవ్యోల్బణాన్ని రగిలిస్తుంది. దీనివల్ల సమాజంలో అందరికంటే ఎక్కువగా నలిగిపోయేది ఆర్థికంగా వెనుకబడిన దిగువ తరగతి, పేద వర్గాలే.

భారత్‌కు ఎదురవుతున్న సవాలు..

గడిచిన కొన్నేళ్లుగా భారతదేశం కోట్ల మందిని పేదరికం నుండి విజయవంతంగా బయటకు తీసుకురాగలిగింది. ఇది దేశం సాధించిన గొప్ప మైలురాయి. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల వల్ల ఆ వర్గాలన్నీ మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం పొంచి ఉండటమే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ విపత్కర పరిస్థితి కేవలం భారత్‌కే కాదు, ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు పెను శాపంగా మారింది. యుద్ధాలు కేవలం ఇంధన సరఫరాను మాత్రమే కాదు, అంతర్జాతీయ సరఫరా గొలుసులను సైతం దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణం గుదిబండగా మారుతోంది. ఇంత జరుగుతున్నా, ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉద్రిక్తతలను తగ్గించడానికి చొరవ చూపుతాయా అంటే సమాధానం శూన్యమనే చెప్పాలి.

 అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష సుంకాల విధానాలు ఇప్పటికే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీశాయి. భవిష్యత్తును లెక్కచేయ కుండా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై జరిపిన దాడులు ప్రపంచ శాంతిని పూర్తిగా ప్రశ్నార్థకం చేశాయి. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం ఎప్పుడు పునరుద్ధరించబడతాయో తెలియని ఈ అనిశ్చిత స్థితిలో, భారత ప్రభుత్వం అంతర్గతంగా గట్టి చర్యలు తీసుకోవడం అత్యవసరం. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు నిజమైన సాధికారత కల్పించే దీర్ఘకాలిక ఆర్థిక విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమో, తాత్కాలిక ఉపశమనం కోసమో కాకుండా... పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి, వారిని స్వయంసమృద్ధులుగా మార్చేలా ఉండాలి. అప్పుడే.   అంతర్జాతీయంగా ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే అంతర్గత శక్తి భారతదేశానికి లభిస్తుంది,  

About The Author