పేదలను దోచుకోవడమే పనిగా మోడీ పరిపాలన
- ఎన్నికలయ్యాక వాత.. ఇంధన ధరలతో వంచన
- కార్పొరేట్లకు ‘దోచిపెట్టి’.. సామాన్యుడిని ‘ముంచిపెట్టి’
- దేశానికి కాంగ్రెస్ పాలనే శ్రీరామరక్ష: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం:
"కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయాలు సామాన్యుడి పాలిట శాపాలుగా మారాయి. పదేళ్ల కాలంలో పేదల సంక్షేమాన్ని పాతరేసి, అడుగడుగునా ఆర్థికంగా అణచివేతకు గురిచేస్తున్నారు" అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిప్పులు చెరిగారు. మత విద్వేషాలు, జాతీయవాదం పేరుతో ఓట్లు దండుకుని గెలిచిన తర్వాత.. ప్రజల నడ్డి విరవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఓట్ల కోసం మౌనం.. గెలిచాక పెంపు!
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ధరల పెంపుపై మౌనంగా ఉన్న కేంద్రం.. పోలింగ్ ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను వంచించిందని మల్‌రెడ్డి మండిపడ్డారు. ఇది 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా' తయారైందని ఎద్దేవా చేశారు. "బంగారం కొనొద్దు.. ఖర్చులు తగ్గించుకోవాలి.. వాహనాలు వాడొద్దు" అని ప్రధాని చెప్పడం ఆయన వైఫల్యానికి నిదర్శనమని, దేశం ఇలాంటి స్థితికి రావడానికి కారణం ఎవరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మూడు దశాబ్దాల క్రితం దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే నేటికీ దేశాన్ని నడిపిస్తున్నాయని మల్‌రెడ్డి గుర్తు చేశారు. మోదీ సర్కార్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడం వల్లే నేడు ఆర్థిక విపత్తులు సంభవిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఉపాధి హామీ పథకం వంటి ప్రజాహిత కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేట్లకు ‘కాపలా’.. ప్రజలకు ‘తిప్పలు’..
పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన మోదీ.. కార్పొరేట్ శక్తులకు వంతపాడుతున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందని, ప్రజలకు సరైన పాలన అందుతుందని ఆయన స్పష్టం చేశారు. మళ్ళీ కాంగ్రెస్ రావాల్సిన అవసరాన్ని నేటి పరిస్థితులు కళ్ళకు కడుతున్నాయని తెలిపారు.
