ఫామ్ హౌస్ మర్డర్ కేసు సంచలనం
- “ఆ రోజు వెళ్లి ఉంటే మేమూ బతికి ఉండేవాళ్లం కాదు” – కరీమా బీ బాధిత మహిళల ఆవేదన
- వృద్ధ మహిళల హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇద్దరు అదృశ్యమైన వృద్ధ మహిళల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వాలని
అడిగినందుకు ఇద్దరు వృద్ధ మహిళలను మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనపై బాధిత మహిళలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన నిందితురాలు కరీమా బీ గతంలో తమను కూడా ఫామ్ హౌస్‌కు రావాలని పలుమార్లు పిలిచిందని, అయితే ఆ సమయంలో తమకు ఇతర పనులు ఉండటంతో వెళ్లలేకపోయామని అప్పు ఇచ్చిన సదరు మహిళలు తెలిపారు. అదే తమ ప్రాణాలను కాపాడిందని వారు భావోద్వేగానికి గురయ్యారు. “ఆ రోజు వెళ్లి ఉంటే నేడు మేమూ బతికి ఉండేవాళ్లం కాదు” అంటూ మీడియా పలువురు మహిళలు ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ నెల 12వ తేదీన పోలీసులు కరీమా బీతో పాటు మిగతా నిందితులను అదుపులోకి తీసుకోవడంతో తాము ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చిన అమాయక వృద్ధ మహిళలను అత్యంత కిరాతకంగా హత్య చేసి, అనంతరం పాతిపెట్టడం మానవత్వానికే మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లి సమానులైన వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసిన కరీమా బీతో పాటు ఈ ఘటనలో పాల్గొన్న మిగతా నిందితులందరికీ కఠిన శిక్ష విధించాలని బాధితులు పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కేసును పోలీసులు వేగంగా ఛేదించడం పై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని తాండూర్ రూరల్ సీఐ ప్రభాకర్ రెడ్డి అన్నారు.jpeg)
